మేరీకోమ్‌ను మించిన స్ఫూర్తి ఎవరు ?

ABN , First Publish Date - 2020-10-16T10:05:51+05:30 IST

తండ్రయ్యాక..వ్యక్తిగత జీవితంతో సమన్వయం చేసుకుంటూ క్రీడా రంగంలో రాణించే విషయంలో దిగ్గజ బాక్సర్‌

మేరీకోమ్‌ను మించిన స్ఫూర్తి ఎవరు ?

విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: తండ్రయ్యాక..వ్యక్తిగత జీవితంతో సమన్వయం చేసుకుంటూ క్రీడా రంగంలో రాణించే విషయంలో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ను మించిన స్ఫూర్తిప్రదాత తనకు ఎవరుంటారని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. విరాట్‌, అనుష్క దంపతులు వచ్చే జనవరిలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ షోలో కోహ్లీ, మేరీకోమ్‌ పలు విషయాలపై ముచ్చటించారు. తండ్రి కాబోతున్నందుకు విరాట్‌ను తొలుత మేరీ అభినందించింది. నలుగురు బిడ్డలకు తల్లయ్యాక కూడా..బాక్సింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న కోమ్‌ను తాను ఆదర్శంగా తీసుకుంటానని విరాట్‌ చెప్పాడు. ‘తల్లయ్యాక..సాధన, పోటీల్లో పాల్గొనడం, వ్యక్తిగత జీవితంతో సమతూకం పాటించడం ఎలా సాధ్యమైంది’ అని 37 ఏళ్ల మేరీకోమ్‌ను ప్రశ్నించాడు. ‘వివాహమయ్యాక భర్త నాకు కొండంత అండగా నిలిచాడు. అతడు ఇచ్చే మద్దతు వెలకట్టలేనిది. ఆయన ఆదర్శ భర్త, తండ్రి. ఇక నాకు తోడ్పడడంలో నా పిల్లలు ఎవరికీ తీసిపోరు’ అని ఒలింపిక్స్‌ కాం స్య పతక విజేత వివరించింది. ‘ఎన్నో కష్టనష్టా లు, సవాళ్లను ఎదుర్కొని మీ క్రీడలో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందుకే మాలాంటి వాళ్లందరికీ మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. తండ్రయ్యాక నేను మీ మార్గంలోనే నడుస్తా’ అని కోహ్లీ అన్నాడు. 

Updated Date - 2020-10-16T10:05:51+05:30 IST