విరాట్‌ శుభవార్తతో..వారికి ‘కంగారు’!

ABN , First Publish Date - 2020-08-29T09:22:17+05:30 IST

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త విరాట్‌ ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది

విరాట్‌ శుభవార్తతో..వారికి ‘కంగారు’!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త విరాట్‌ ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రస్తుతం గర్భవతి అయిన   అనుష్క జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే కోహ్లీ తండ్రి కానున్నాడన్న వార్త క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను మాత్రం ఆందోళనకు గురి చేస్తోందట. ఆస్ట్రేలియా పత్రిక ‘ది కొరియర్‌ మెయిల్‌’ కథనం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ టూర్‌లో భాగంగా డిసెంబరు 3న తొలి టెస్ట్‌కు తెరలేవనుండగా.. వచ్చే ఏడాది జనవరి 12న మూడు వన్డేల సిరీస్‌ మొదలు కానుంది. వాస్తవంగా.. ఈ టూర్‌ అక్టోబరులోనే ప్రారంభం కావాలి. ఇరు జట్లు మూడు టీ20ల్లో తలపడాలి. ఆ తర్వాత పొట్టి ప్రపంచ కప్‌. అనంతరం టెస్ట్‌, వన్డే సిరీస్‌లో భారత్‌-ఆసీస్‌ పాల్గొనాల్సి ఉంది. కానీ కరోనాతో పొట్టి ప్రపంచ కప్‌ వాయిదా పడడం, అలాగే ఐపీఎల్‌ షెడ్యూల్‌ మారిన నేపథ్యంలో ఆ మూడు  టీ20ల నిర్వహణపై బీసీసీఐ, సీఏ కసరత్తు చేస్తున్నాయి.. మొత్తంగా భారత్‌తో సిరీస్‌ ద్వారా దాదాపు రూ. 222 కోట్ల ఆదాయం రాగలదని క్రికెట్‌ ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది. కొవిడ్‌-19తో తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోయిన సీఏ.. ఈ సిరీస్‌పై గంపెడాశలు పెట్టుకొంది. అయితే, ఈ సిరీస్‌ మొదలయ్యే నాటికి అనుష్కకు తొమ్మిదో నెల వస్తుంది. అప్పుడు కోహ్లీ సిరీస్‌లో ఆడేది అను మానమే. అసలే.. కరోనా కారణంగా స్టేడియాలకు ప్రేక్షకులను అనుమ తించడం లేదు.. పైగా విరాట్‌లాంటి స్టార్‌ ఆటగాడు కూడా ఆడకపోతే సిరీస్‌ కళ తప్పుతుందేమోనన్నది ఆస్ట్రేలియా ఆందోళన. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఆసీస్‌ సిరీస్‌లో విరాట్‌ తప్పక ఆడతాడని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తండ్రి చనిపోయినప్పుడు కోహ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

 కాగా.. ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై విరాట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, కోహ్లీ ఆ సిరీస్‌ ఆడతాడనే తాము భావిస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-08-29T09:22:17+05:30 IST