ఇక్కడికొచ్చింది.. జల్సా కోసం కాదు

ABN , First Publish Date - 2020-09-02T09:28:37+05:30 IST

యూఏఈకి వచ్చింది వినోదం కోసమో, సరదా కోసమో కాదన్న విషయాన్ని గుర్తెరగాలని రాయల్‌ చాలెంజర్స్‌ ..

ఇక్కడికొచ్చింది..  జల్సా కోసం కాదు

బయో బబుల్‌ను గౌరవించాలి

సహచరులకు కోహ్లీ హితబోధ


దుబాయ్‌: యూఏఈకి వచ్చింది వినోదం కోసమో, సరదా కోసమో కాదన్న విషయాన్ని గుర్తెరగాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆటగాళ్లకు హితవు పలికాడు. కేవలం క్రికెట్‌పైన అందరూ దృష్టి పెట్టాలని, అలాగే బయో సెక్యూర్‌ బబుల్‌ను గౌరవించాలని సూచించాడు. ఆర్‌సీబీ యూట్యూబ్‌ షో ‘బోల్డ్‌ డైరీస్‌’ కోసం విరాట్‌ పలు విషయాలపై మాట్లాడాడు. ‘కరోనా కారణంగా నేనేమీ ఆటకు దూరమైనట్టు భావించలేదు. ఎందుకంటే గత పదేళ్లుగా రాత్రి, పగలు తేడా లేదన్నట్టుగా క్రికెట్‌ ఆడుతూ వస్తున్నా. దీంతో నా మదిలో ఎప్పుడూ క్రికెట్‌ ఆలోచనలే ఉండేవి. ఇప్పుడు ఐపీఎల్‌ కారణంగా మళ్లీ బ్యాట్‌ పట్టా. అయితే మనం ఇక్కడి వచ్చింది క్రికెట్‌ ఆడేందుకు మాత్రమేనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.


అంతేకానీ జల్సా చేసేందుకో.. లేక దుబాయ్‌ అందాలను చూసేందుకో రాలేదు. అందుకే బయో బబుల్‌ను అంతా గౌరవించాల్సిందే. గతంలో మాదిరిగా ఇప్పుడు మనం జీవించలేం. ఈ దశను అంతా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని ఆటగాళ్లకు సూచించాడు. అలాగే కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌ జరుగుతుందని ఊహించలేదని కూడా చెప్పాడు. తొలిసారి ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం అడుగుపెట్టినప్పుడు అంతా కొత్తగా అనిపించిందని, కాస్త ఒత్తిడికి కూడా లోనయ్యానని వెల్లడించాడు. 


ఆ శబ్దాన్ని ఇప్పటిదాకా వినలేదు..

బయో బబుల్‌ వాతావరణానికి, ప్రేక్షకుల్లేకుండా ఆడేందుకు తాము అలవాటు పడాల్సి ఉంటుందని తెలిపాడు. ‘ఇదంతా పెద్ద కష్టమేమీ కాదని చెప్పను. నిజానికి నా బ్యాట్‌కు బంతి తగిలిన శబ్దాన్ని గత పదేళ్లుగా వినలేదు. చివరగా నేను రంజీ ట్రోఫీ ఆడినప్పుడు ఇలా ఖాళీ స్టేడియంలో ఆడాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ అనుభవం ఎదురుకాబోతోంది.


స్టేడియాల్లో అభిమానులు ఉండడం ఆటగాడికి కిక్కిస్తుంది. వికెట్‌ పడినప్పుడు కూడా మేం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఇక తండ్రిని కాబోతుండడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తోంది’ అని కోహ్లీ తెలిపాడు.


వామప్‌ మ్యాచ్‌లు కావాలి

ఐపీఎల్‌కు ఈనెల 19న తెరలేవనుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు సన్నాహక మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నట్టు తెలిసింది. లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లు ఐదు నెలలుగా ఇళ్లకే పరిమితం కావడం వారి ప్రాక్టీస్‌పై ప్రభావం చూపింది. దీంతో ఆటగాళ్లు మళ్లీ లయలోకి రావాలంటే కొన్ని వామప్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని ఆయా ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట.


‘కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడితే ఆటగాళ్లు మళ్లీ గాడిన పడతారు. హోరాహోరీగా సాగే మ్యాచ్‌ల వల్ల లీగ్‌కు మంచిది’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి అన్నారు. జట్లన్నీ ఈ ఆలోచనపై చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-02T09:28:37+05:30 IST