Advertisement
Advertisement
Abn logo
Advertisement

విరాట్‌కు దారిచ్చేదెవరు?

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విశ్రాంతి ముగియనుంది. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగే రెండో టెస్టులో అతడు భారత జట్టులో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి చోటిచ్చేందుకు ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఆటతీరు చూశాక ఈ చర్చ ఎక్కువైంది. ఇందుకోసం ఓ బౌలర్‌ను తగ్గించే సాహసానికి మాత్రం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సిద్ధంగా లేదు. ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌లోనే కివీ్‌సను అద్భుతంగా కట్టడి చేయగలిగారు. దీంతో రహానె, పుజార, గిల్‌, మయాంక్‌లలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది.


ఇందులో తాత్కాలిక కెప్టెన్‌ రహానె ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 12 టెస్టుల్లో అతని సగటు 19.57 మాత్రమే. ఈ పేలవ ప్రదర్శనతో తన ఓవరాల్‌ సగటు కూడా తొలిసారి 40 కింది (39.60)కి పడిపోయింది. మరోవైపు నయా వాల్‌ పుజార విషయానికి వస్తే.. గతేడాది 20.37, ఈ ఏడాది 30.42 సగటుతో కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్‌గా అతడి 55.33 యావరేజ్‌ ఆశాజనకంగానే కనిపిస్తోంది. అంతేకాకుండా ముంబై టెస్టులో పుజారను ఓపెనింగ్‌గా పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో అతను ఆరు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 116


సగటుతో మెరుగైన రికార్డుతో ఉన్నాడు.  

మయాంక్‌, గిల్‌.. ఎవరో ఒకరు!

నిజానికి మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఇద్దరూ రెగ్యులర్‌ ఓపెనర్లు కాదు. రోహిత్‌-రాహుల్‌ గైర్హాజరీతోనే వీరికీ అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ అర్ధసెంచరీ సాధించినా జేమిసన్‌ను ఎదుర్కోలేకపోతున్నాడు. మయాంక్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రాలేదు. అయితే గిల్‌కన్నా మయాంక్‌కు ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉంది. ఒకవేళ పుజారను ఓపెనర్‌గా పంపితే.. మూడో స్థానంలో రహానె లేక శ్రేయా్‌సను ఆడించవచ్చు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ముంబై తరఫున ఈ ఇద్దరికీ వన్‌డౌన్‌లో ఆడిన అనుభవం ఉంది. ఇదిలావుండగా కేఎస్‌ భరత్‌ కూడా గతంలో ఓపెనర్‌గా ఆడాడు. ముంబై టెస్టులో అతడిని అరంగేట్రం చేయిస్తే సాహా కెరీర్‌ ముగిసినట్టే.


శ్రేయాస్‌ను తప్పించగలరా?

అరంగేట్రంలోనే రికార్డు ప్రదర్శనతో శతకం, అర్ధసెంచరీ బాదేసిన శ్రేయాస్‌ అయ్యర్‌ను కోహ్లీ కోసం తప్పించే అవకాశమైతే కనిపించడం లేదు. తీవ్ర ఒత్తిడి నెలకొన్న స్థితిలోనే అయ్యర్‌ నుంచి ఈ రెండు అద్భుత ఇన్నింగ్స్‌ రావడం విశేషం. అయితే అప్పట్లో కరుణ్‌ నాయర్‌ ఇంగ్లండ్‌పై ట్రిపుల్‌ సెంచరీ (303) సాధించాక.. వెంటనే బంగ్లాదేశ్‌తో సిరీ్‌సకు రహానె కోసం పక్కన పెట్టారు. కానీ ప్రస్తుతం అయ్యర్‌పై అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారా అనేది సందేహమే.

Advertisement
Advertisement