Abn logo
Sep 28 2021 @ 03:17AM

దుర్గగుడిలో ‘ధర్మపథం’

  • వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌ 


విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ‘థర్మపథం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. హిందూ దేవాలయాల్లో కళా, సాంస్కృతిక, ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా దేవదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎం.వి.సురే్‌షబాబు మాట్లాడుతూ ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రతి రోజూ సాంస్కతిక కార్యక్రమాలు, యోగా శిక్షణ, వైద్య ఆరోగ్యపరమైన కార్యక్రమాలు నిర్వహించాలనేదే ‘థర్మపథం’ ఉద్దేశమన్నారు. దుర్గగుడి పాలకమండలి చైౖర్మన్‌ పైలా సోమినాయుడు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.విజయరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  దుర్గగుడిలోని కళా వేదికపై పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం తదితర సాంస్కృతిక కళారూపాలు, యోగాసనాలు ఆకట్టుకున్నాయి. 

దసరా ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

 

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి.వాణీమోహన్‌, దుర్గగుడి కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ వైదిక కమిటీ సభ్యులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.