Abn logo
Jul 6 2020 @ 05:42AM

వై...రష్‌

జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

ఆదివారం 148 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ

 2,107కు చేరుకున్న కేసుల సంఖ్య 

పెద్దాపురం మండలం-23, జేఎన్టీయూ క్వారంటైన్‌-21,  కాకినాడ సూర్యనారాయణపురం-20, ఏపీఎస్పీ-12

 రాజమహేంద్రవరం సిటీ-35, రూరల్‌-29


(కాకినాడ, ఆంధ్రజ్యోతి): కరోన వైరస్‌ అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోంది. జనాలను పట్టిపీడిస్తోంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా 148 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,107కు చేరుకుంది. జేఎన్టీయూ క్వారంటైన్‌ సెంటర్లో అనుమానితులకు పరీక్షలు చేయగా 21 మందికి వైరస్‌ సోకినట్టు రిపోర్టులు వచ్చాయి. ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో మరో 12 కేసులు నమోదయ్యాయి. కాకినాడ జీజీహెచ్‌-8, జగన్నాథపురం-6, కొండయ్యపాలెం-8, ముత్తానగర్‌-8, పర్లోవపేట-6, రాజమహేంద్రవరం సిటీ-35, రూరల్‌-29, కుతుకులూరు-2, లక్కవరం-3, మండపేట-2, వాకతిప్ప-1, అన్నవరం-1, బొమ్మూరు-3, చెల్లూరు-3.. మిగతాచోట్ల కలిపి మొత్తం 148 కేసులు వెలుగు చూశాయి. 


పెద్దాపురం: పెద్దాపురం మండల పరిధిలో ఆదివారం 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులిమేరు, కాండ్రకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఇవి వెలుగు చూసినట్టు వైద్యాధికారులు డాక్టర్‌ ఎం.రాంబాబునాయక్‌, డాక్టర్‌ అడారి అనూష తెలిపారు. ఇటీవల ఈ పీహెచ్‌సీల పరిధిలో సుమారు 200 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యిందన్నారు. జి.రాగంపేట-8, చదలాడ-4, చంద్రమాంపల్లి-3, పులిమేరు-2, మర్లావ-4, కట్టమూరు-1, కాండ్రకోట-1 చొప్పున కేసులు వచ్చాయి. మర్లావ గ్రామంలో వైరస్‌ సోకిన వ్యక్తులు ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు డాక్టర్‌ అనూష తెలిపారు. ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి  పర్యవేక్షణలో ఆయా పంచాయతీల కార్యదర్శులు పారిశుధ్య పనులు చేపట్టారు.  


పౌష్టికాహారం పెట్టరు

 మందులూ ఇవ్వట్లేదు 

కొవిడ్‌ సెంటర్లలో ఇదీ పరిస్థితి

బీపీ, షుగర్‌ టాబ్లెట్లు ఇళ్ల నుంచి తెప్పించుకుంటున్నామని బాధితుల ఆవేదన


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. కానీ రోగులకు వైద్య, ఇతర సౌకర్యాలు సరిగ్గా అందట్లేదు. వారు త్వరగా కోలుకోవడానికి అవసరమైన పౌష్టికాహారం అందట్లేదనే విమర్శలున్నాయి. పాజిటివ్‌ నిర్ధారణ అయిన రోగులకు కూడా మందులు ఇవ్వడం లేదని... సాధారణ భోజనం పెట్టి వార్డుల్లోనే ఉంచుతున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బొమ్మూర్‌ టిడ్కో అర్బన్‌ హౌసింగ్‌ కాలనీ, అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రి, రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిల్లో కొవిడ్‌-19 వార్డులు ఏర్పాటు చేశారు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. వైద్యులను కూడా వైరస్‌ వదలడం లేదు. ఇప్పటికే జిల్లాలో 1,700 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 450 మందికి పైగా బయటపడి ఐసోలేషన్‌           వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా సుమారు 1,200 మంది ఆసుపత్రుల్లోనే ఉన్నారు. బొమ్మూరులోని క్వారంటైన్‌లోనే అత్యధికంగా 530 మంది పాజిటివ్‌ రోగులు, 60 మంది అనుమానితులు ఉన్నారు. కరోనా వైరస్‌ ధాటిని తట్టుకోవాలంటే మందులతో పాటు పౌష్టికాహారం అందించాలి. యోగా చేయించాలి.


కానీ ఇక్కడ సాధారణ భోజనం మాత్రమే పెడుతున్నారు. ఉదయం ఉప్మా లేదా ఏదైనా టిఫిన్‌ పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనం, ఒక కూర, సాంబారు, పెరుగు, గుడ్డు, అరటి పండు ఇస్తున్నారు. తర్వాత స్నాక్స్‌ ఏమీ ఇవ్వడం లేదు. బొమ్మూరులో రెండు రోజుల క్రితం నాసిరకం భోజనం పెట్టడంతో అందరూ ఆందోళన చెందారు.  రోగులతో పాటు పాటు అక్కడ పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది కూడా అదే భోజనం చేయాల్సి వస్తోంది. ఇక రోగులకు మందులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఓ రోగి బంధువులు వాపోయారు. సాధారణ భోజనాన్ని మాత్రం సమయానికే పెడుతున్నారని, సి-విటమన్‌ టాబ్లెట్స్‌ కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. వైద్యులు మాత్రం  వచ్చి పరిశీలించి వెళుతున్నారు. బీపీ, షుగర్‌లకు కూడా మందులు ఇవ్వకపోవడంతో ఇళ్ల నుంచి రప్పించుకుంటున్నామని మరికొందరు తెలిపారు. ఈ పరిస్థితుల్లో బాధితులు ఆందోళన చెందుతున్నారు. 


Advertisement
Advertisement
Advertisement