వరిపై తెగుళ్ల దాడి

ABN , First Publish Date - 2021-02-25T05:06:26+05:30 IST

సాగు నీటి కొరతకు తోడు వాతావరణ మార్పులతో ఆలస్యం నాట్లు పడిన వరిపై తెగుళ్లు ఆశిస్తున్నాయి.

వరిపై తెగుళ్ల దాడి

వరి పైరును ఆశించిన దుబ్బు కుళ్లు, అగ్గి తెగులు

సాగు నీరు కొరత, వాతావరణ మార్పులతో ఆందోళన


భీమవరం రూరల్‌ / పాలకొల్లు రూరల్‌, ఫిబ్రవరి 24 : సాగు నీటి కొరతకు తోడు వాతావరణ మార్పులతో ఆలస్యం నాట్లు పడిన వరిపై తెగుళ్లు ఆశిస్తున్నాయి. భీమవరం మండలంలో 7వేల ఎకరాల్లో ఆలస్యంగా నాట్లు పడ్డాయి. 15 రోజుల నుంచి మంచు, చలి తీవ్రంగా ఉండడం గడిచిన నాలుగు రోజులలో వర్షం, మేఘాలతో అగ్గి తెగులు విజృంభిస్తోంది. రైతులు అగ్ని తెగులు నివారణకు పురుగుమందుల పిచికారి చేస్తున్నారు. తెగుళ్లతో పైరు ఎదుగుదల నిలిచిపోతుందని, దిగుబడి తగ్గే అవకాశం ఉందని కంగారు పడుతున్నారు. అగ్ని తెగులు నివారణకు రైసోక్లోజర్‌ పౌడర్‌ను ఎకరానికి 100 గ్రాముల చొప్పున పిచికారి చేయాలని అధికారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం రైతులు పురుగుమందుల పెట్టుబడి భారం అధికమైంది. 


పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల్లోని వరిచేలల్లో దుబ్బు కుళ్లు వ్యాధి ఆశిస్తోంది. పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బు కుళ్లు తెగులు భూమి ద్వారా కానీ, నీటి ద్వారాకానీ ఆశిస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణకు చర్యలు తీసుకోవచ్చని ఏవో అబ్దుల్‌ రహీం అన్నారు. దుబ్బుకుళ్ళ వ్యాధి నివారణకు ఎకరానికి కొసీడ్‌ 500 గ్రాముల మందును ఇసుక కానీ, పొటాష్‌ ఎరువులో కానీ కలిపి వెదజల్లాలని ఏవో సూచించారు. చేలల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, రైతులు చేలల్లో నీటి పారుదల సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2021-02-25T05:06:26+05:30 IST