వలస కార్మికులకు వైరస్ కష్టం

ABN , First Publish Date - 2020-05-23T08:14:13+05:30 IST

రాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కార్మికులతో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పది రోజుల వ్యవధిలో 118 కేసులు

వలస కార్మికులకు వైరస్ కష్టం

  • తిరిగొచ్చిన కార్మికుల్లో కరోనా తీవ్రం
  • పరీక్ష చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి 
  • 300 పరీక్షల్లో 118 మందికి పాజిటివ్‌
  • సడలింపు తర్వాత మరణాలూ అధికం
  • ముగ్గురు పోలీసులకు పాజిటివ్‌!
  • వలస కార్మికుల విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌
  • గాంధీ విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌
  • 62 కొత్త కేసులు.. 3 మరణాలు
  • 19 మంది వలస కార్మికులకు కూడా
  • జగిత్యాలలో వలస వచ్చిన 9 మందికి



చెన్నై నుంచి ఛత్తీ్‌సగఢ్‌కు లారీలో వెళుతున్న ముగ్గురు వలస కూలీల్లో ఒకరికి దగ్గు, జలుబు, జ్వరంతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లారీ డ్రైవర్‌ వారిని కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలో దించేశాడు. స్థానిక వైద్యుడొకరు ధైర్యం చేసి, వారిని హైదరాబాద్‌ తరలించారు. ముగ్గురిలో ఒకరు మరణించారు. బాధితులు లారీ దిగిన తర్వాత స్థానికుడి సాయంతో ఇంటికి ఫోన్‌ చేశారు. ఫోన్‌ ఇచ్చిన వ్యక్తి కుటుంబాన్ని కూడా క్వారంటైన్‌ చేశారు.


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి తిరిగివచ్చిన వలస కార్మికులతో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పది రోజుల వ్యవధిలో 118 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం వరకు వివిధ రాష్ట్రాల నుంచి 95 వేల మంది రైలు, రోడ్డు మార్గాల్లో తిరిగి వచ్చి, స్వస్థలాలకు చేరుకున్నారు. రోజుకు సగటున ఐదు వేల మంది వస్తున్నారు. వలస కార్మికులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మే మొదటి వారంలో అనుమతినిచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రానికి వలసల తాకిడి ప్రారంభమైంది. మే 7న తొలిసారి ముంభై నుంచి వచ్చిన ముగ్గురు వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరిహద్దుల వద్దే స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. లక్షణాలున్న వారికి వెంటనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లేని వారిని ఇంటివద్దే క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. శుక్రవారం వరకు లక్షణాలున్న 301 మందికి పరీక్షలు చేశారు. అందులో 118 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రతీ 16 పరీక్షలకు ఒక పాజిటివ్‌ కేసు నమోదైతే, వలస కార్మికుల్లో ప్రతీ మూడు పరీక్షలకు ఒక పాజిటివ్‌ తేలుతోంది.  వలసలు కూడా కొన్ని జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. జగిత్యాల జిల్లాలో 8 మందికి శుక్రవారం కొత్తగా వైరస్‌ నిర్థారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది. మంచిర్యాల జిల్లాలో 21,  యాదాద్రి జిల్లాలో 23 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి.  విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు 1700 మంది వెనక్కి తిరిగివచ్చారు. నేరుగా ఇళ్లకు పంపకుండా వివిధ హోటల్స్‌లో ఉంచారు.   లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించారు. అందులో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


13 మంది ఆరోగ్యవంతులూ

మరణాల సంఖ్య గురువారం సాయంత్రం వరకు 48కి చేరుకుంటే అందులో 13 మంది మినహా మిగిలిన వారంతా వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారే. వైరస్‌ సోకడం, దానికితోడు అప్పటికే ఇతర వ్యాధులు ఉన్న కారణంగా త్వరగా కన్నుమూశారు. వైరస్‌ సోకి, ఇతర అనారోగ్య సమస్యలేవీ లేని వారు కూడా  13 మంది చనిపోవడం బాగా ఆందోళన కలిగిస్తోంది. కాగా ఆరోగ్యంగా ఉండి చనిపోతున్న వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం ఒక కారణమైతే, వైరస్‌ సోకిన సంగతి సకాలంలో గుర్తించలేక పోవడం మరో కారణం. ఇలా మరణించిన వారిలో చాలామంది వైరస్‌ సోకిన 15 రోజుల తర్వాత కానీ ఆస్పత్రికి రాలేదు. రెండురోజుల క్రితం మరణించిన ఓ ఉద్యోగి వైరస్‌ అనుమానిత లక్షణాలున్నప్పటికి 15 రోజుల తర్వాత గానీ ఆస్పత్రికి రాలేదు. దాంతో అతడికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినప్పటికి వైరస్‌ కారణంగా చనిపోయాడని అధికారులు చెబుతున్నారు. మున్ముందు ఇలాంటి మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.



Updated Date - 2020-05-23T08:14:13+05:30 IST