బడిలో భయం.. భయం

ABN , First Publish Date - 2021-04-16T09:46:10+05:30 IST

పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. విద్యాసంస్థలు వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారాయి. కొవిడ్‌ రెండోదశలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతుండటం, సెకండ్‌

బడిలో భయం.. భయం

పాఠశాలలపై వైరస్‌ పంజా 

కరోనా హాట్‌స్పాట్లుగా విద్యాసంస్థలు..

మాస్కులు ధరించని విద్యార్థులు 

బడుల్లో కనిపించని భౌతిక దూరం..

కిక్కిరిసిన ఆటోలు, బస్సుల్లో బడికి

కరోనాను పట్టించుకోని టీచర్లు..

చాలాచోట్ల అమలు కాని నిబంధనలు

కొవిడ్‌ ప్రభావంతో తగ్గిన హాజరు శాతం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన

కరోనా హాట్‌స్పాట్లుగా విద్యాసంస్థలు..

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. విద్యాసంస్థలు వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారాయి. కొవిడ్‌ రెండోదశలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతుండటం, సెకండ్‌ వేవ్‌లో చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. పాఠశాలల్లో నిబంధనలు పాటిస్తున్నారో లేదోనని విద్యాశాఖ ఉన్నతాధికారులు కనీసం ఆరా తీయడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాఠశాలల విజిట్‌లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. అధిక శాతం బడుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం కానీ, మాస్కు ధారణ కానీ కనిపించలేదు. ఒక్కో గదిలో 40నుంచి 70మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.


అక్కడక్కడా మాత్రం తూతూమంత్రంగా పాటిస్తున్నా చాలాచోట్ల కొవిడ్‌ నిబంధనలు అమలు కావట్లేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పాఠశాలల బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను గుంపులుగా ఎక్కిస్తున్నారు. 


తూతూమంత్రంగా....

గుంటూరు జిల్లాలోని విద్యాసంస్థల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా గుంటూరు నగరంలోని రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కరోనాతో మృతి చెందారు. ఈపూరు మండలం మోడల్‌ స్కూల్‌లో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో భౌతిక దూరం, శానిటైజేషన్‌, మాస్క్‌ల ధారణ తూతూమంత్రంగా అమలు చేస్తున్నారు.  



నిబంధనలు గాలికి...

అనంతపురం జిల్లావ్యాప్తంగా 90 శాతం పాఠశాలల్లో నిబంధనల అమలును గాలికొదిలేశారు. విద్యార్థులు మాస్కు ధరించేలా, భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు చేతులెత్తేశారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. గుత్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు మాస్కు ధరించకపోగా విద్యార్థులను తన చుట్టూ నిలుచోబెట్టుకొని పాఠాలు చెబుతున్నారు. 


హాజరు నిల్‌ 

కృష్ణాజిల్లా విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో 650మంది విద్యార్థులకుగాను 12మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాల హెచ్‌ఎంకు గతంలో పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నారు. మండవల్లి జెడ్పీ హైస్కూల్‌ టీచర్‌కు వైరస్‌ సోకడంతో విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధి ముక్తినూతలపాడు హైస్కూలులో గురువారం ఉపాధ్యాయులు తప్ప విద్యార్థులు ఒక్కరూ రాలేదు. స్కూల్‌ ఎదుట ఉన్న దుకాణంలోని వ్యక్తులకు కరోనా రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కు పంపడం లేదు. కందుకూరులోని హార్టికల్చర్‌ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు, వార్డెన్‌కు కరోనా సోకడంతో కాలేజీ మూసివేశారు. 


గదిలో 60మందికి పైగా 

కర్నూలు జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 720మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. గురువారమే 83మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నందికొట్కూరు పట్టణంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో 60మందికి పైగా విద్యార్థులు కూర్చోబెట్టారు. 


43మంది టీచర్లు.. 46 మంది విద్యార్థులు

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 43మంది ఉపాధ్యాయులు, 46మంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం మరిచారు. విద్యార్థులంతా పక్క పక్కనే కూర్చుంటుండగా ఉపాధ్యాయులు కూడా అలానే పాఠాలు బోధిస్తున్నారు. విరామవేళల్లో బయట తిరిగేటప్పుడు కూడా ఇదే పరిస్థితి.


ఆటోలు కిటకిట 

కడప జిల్లా బొల్లవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఇటీవల నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఆరు రోజుల పాటు పాఠశాల మూసివేయాలని డిప్యూటీ డీఈవో జారీ చేసిన ఆదేశాలను పాఠశాల యాజమాన్యం లెక్క చేయలేదు. జమ్మలమడుగులో విద్యాసంస్థలకు ప్రైవేట్‌ బస్సులు, ఆటోల్లో మాస్క్‌లు లేకుండానే గుంపులుగా వస్తున్నారు. 


Updated Date - 2021-04-16T09:46:10+05:30 IST