వైరస్‌ పంజా

ABN , First Publish Date - 2022-01-19T06:41:08+05:30 IST

అనంతలో కరోనా పంజా విసురుతోంది. థర్డ్‌వేవ్‌ ప్రజలను దడపుట్టిస్తోంది.

వైరస్‌ పంజా
మెడికోలకు బూస్టర్‌ డోస్‌ వేస్తున్న వైద్య సిబ్బంది

24 గంటల్లో 462 మందికి కరోనా..

వైద్య కళాశాలలో అప్రమత్తం

మెడికోలకు బూస్టర్‌ డోస్‌

అధికారుల తీరుపై విమర్శలు

అనంతపురం వైద్యం, జనవరి 18: అనంతలో కరోనా పంజా విసురుతోంది. థర్డ్‌వేవ్‌ ప్రజలను దడపుట్టిస్తోంది. రోజురోజుకీ కరోనా మహమ్మారి జనంపై విరుచుకుపడుతోంది. పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. మంగళవారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 462 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 160697 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో 157747 మంది ఆరోగ్యంగా  కోలుకున్నారు. 1093 మంది మరణించగా, ప్రస్తుతం 1857 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదు నెలల్లో కేసులను పరిశీలిస్తే మంగళవారం నమోదైన కేసులు 40 శాతం పెరిగిపోయాయి. దీనిని బట్టే జిల్లాలో కరోనా ఉధృతి ఏస్థాయిలో కొనసాగుతోందో తెలుస్తోంది. పాజిటివిటీ రేటు భారీగా పెరగడంతోపాటు బాధితుల సంఖ్య అదేస్థాయిలోనే ఉంటోంది. అధికార యంత్రాంగం కరోనా విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం అధికారులతో సమావేశాలు పెడుతూ ఆస్పత్రుల్లో వసతులు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిస్తూ సాగుతున్నారు. కనీసం కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచించడం లేదు. అనుమానితులు పరీక్షలు చేయించుకోవడానికి వస్తే చేస్తున్నారు తప్పా.. పాజిటివ్‌ బాధితుల కాంటాక్ట్‌లను గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయడం లేదు. తూతూమంత్రంగా ఎవరికో ఒకరికి కాంటాక్ట్‌ పేరుతో ఫోన్లకు మెసేజ్‌లు పంపించి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వైద్యశాఖ కరోనా విషయంలో  నిద్రమత్తులో తూగుతోంది. ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేవు. కనీసం వైద్యులు, సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజులు కూడా లేవు. కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించే వారికి ప్రత్యేకంగా కొవిడ్‌ పీపీఈ కిట్లు లేవు. ఏదైనా అడిగితే కలెక్టర్‌, జేసీల పేర్లు చెప్పి వైద్యాధికారులు తప్పించుకుంటున్నారు. దీనిని బట్టే కొవిడ్‌ విషయంలో ఇటు వైద్యశాఖ, అటు జిల్లా ఉన్నతాధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతోంది. కరోనా విజృంభిస్తుండడంతో జనం గత రెండు వేవ్‌ల కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆందోళనతో బతుకుతున్నారు.


మెడికోలకు బూస్టర్‌ డోస్‌

వైద్య కళాశాలలో చదువుతున్న ఫైనలియర్‌ విద్యార్థుల విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏడుగురు మెడికోలు కరోనా బారిన పడ్డారు. వారికి మంగళవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ జాగ్రత్తల్లో భాగంగా ఫైనలియర్‌ మెడికోలందరికీ బూస్టర్‌ డోస్‌ వేయించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ, ప్రొఫెసర్స్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రవిరాజ్‌, డాక్టర్‌ మహేశ, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ పరదేశినాయుడు తదితరులు దగ్గరుండి విద్యార్థులకు బూస్టర్‌ డోస్‌ వేయించారు. కరోనా నిబంధనల మేరకు పరీక్షలకు ఏర్పాట్లు చేసి, కొవిడ్‌ బారిన పడిన మెడికోలకు పరీక్షలు రాయించారు.

Updated Date - 2022-01-19T06:41:08+05:30 IST