కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-09-21T06:06:37+05:30 IST

కరోనా ఉమ్మడి జిల్లాను పట్టిపీడిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తున్నది

కరోనా కల్లోలం

ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తున్న వైరస్‌

31,114 మందికి పాజిటివ్‌

293 మంది మృతి 

కోలుకున్న 19,594 మంది 

2.39 లక్షల మందికి పరీక్షలు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా ఉమ్మడి జిల్లాను పట్టిపీడిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తున్నది. ఇప్పటికే వ్యాధిబారినపడి ఉమ్మడి జిల్లా పరిధిలో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. 


మర్కజ్‌తో మొదలు.. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో విస్తరణ

రాష్ట్రంలో మార్చి 2న కరోనా తొలికేసు నమోదు కాగా,  కరీంనగర్‌ జిల్లాలో మార్చి 17న ఆ వ్యాధి అడుగుపెట్టింది. మర్కజ్‌ నుంచి వచ్చిన ఇండోనేషియన్ల కారణంగా జిల్లాలో ప్రారంభమైన వైరస్‌ వ్యాప్తి మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో విస్తరించింది. నాలుగు విడతల లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్‌,  ముంబాయి, భీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు తిరిగి రావడంతో క్రమేపి వైరస్‌ విస్తరించడం ప్రారంభించింది. మార్చి, ఏప్రిల్‌లో పెద్దగా ప్రభావం చూపని వైరస్‌ జూన్‌, జూలైలో ప్రభావం చూపించడం ప్రారంభించింది. ఆగస్టు, సెప్టెంబరులో తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నది. 


కరీంనగర్‌ జిల్లాలో అత్యధికం

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 2,39,319 మందికి కోవిడ్‌ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్‌, రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. నాలుగు జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులతోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 18వ తేదీవరకు  నాలుగు జిల్లాల్లో కలిపి  31,114 మందికి కరోనా వ్యాధి సోకింది. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 13,868 మందికి వ్యాధి సోకగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,826 మందికి, జగిత్యాల జిల్లాలో 6,750 మంది, పెద్దపల్లి జిల్లాలో 3,670 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో కరీంనగర్‌ జిల్లాలో 126 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 మంది, జగిత్యాల జిల్లాలో 47 మంది, పెద్దపల్లి జిల్లాలో 35 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని, ప్రైవేట్‌గా సీటీస్కాన్‌ పరీక్షలు చేయించుకొని మందులు వాడే వారిలో అలాగే ఇతర జిల్లాల్లో పరీక్షలు చేయించుకొని వచ్చి ఎవరికి తెలియకుండా మందులు వాడుతున్న వారిలో వ్యాధి విషమించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారని తెలిసింది. అలాంటి వారి మరణాలు సాధారణ మరణాలుగానే భావిస్తుండడంతో లెక్కలోకి రాకుండా పోతున్నట్లు సమాచారం.


చికిత్స పొందుతున్న 11,237 మంది

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు వ్యాధి సోకిన 31,114 మందిలో 19,584 మంది కోలుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితోపాటు హోంఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడుతున్న వారి సంఖ్య 11,237 ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకున్న వారి వివరాల మేరకు వ్యాధి తీవ్రత ఇలా ఉంది. సీటీస్కాన్‌, ఇతర ప్రాంతాలలో పరీక్షలు చేయించుకొని వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, అలాంటి వారితో కలుపుకుంటే రోగుల సంఖ్య మరింత పెరుగవచ్చని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో  80 శాతం ఇప్పటికే వ్యాధి సోకింది. 


కనీస జాగ్రత్తలు కరువు

గతంలో మాదిరిగా మాస్క్‌లు ధరించక పోవడం, భౌతిక దూరాన్ని పాటించక పోవడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోక పోవడం, రోడ్లపై విచ్చలవిడిగా తిరగడం వంటి కారణాలతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని భావిస్తున్నారు.  గతంలో మాదిరిగా కోవిడ్‌ నిర్ధారణ అయిన ప్రాంతాలను కట్టడి చేయకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు. కొవిడ్‌ బారినపడిన వారికి గతంలో 14 రోజులు, మరికొంత మందికి 28రోజులు హాస్పిటల్‌, హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయగా ఇప్పుడు మూడు, నాలుగు రోజులకే వ్యాధిగ్రస్తులు తమకు వ్యాధి నయమైందని చెబుతూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చాలా మందికి కొవిడ్‌ లక్షణాలు  కనిపించక పోవడంతో వారితో సన్నిహితంగా ఉన్న వారందరికి వైరస్‌ సోకుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మాదిరిగా కట్టడి చేయక పోవడం, ప్రజలు  బాధ్యతరాహితంగా వ్యవహరించడం వ్యాధి తీవ్రతకు కారణమవుతుందని చెబుతున్నారు.

Updated Date - 2020-09-21T06:06:37+05:30 IST