కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారు: గంటా

ABN , First Publish Date - 2021-03-25T21:34:33+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం రాజీనామా బలమైన అస్త్రమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారు: గంటా

శ్రీకాకుళం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం రాజీనామా బలమైన అస్త్రమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే స్టీల్‌ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైనదన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిందని తెలిపారు. సీఎం జగన్‌పై బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన సీనియారిటీని ప్రక్కన పెట్టి జగన్‌తో నడుస్తానన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారని గంటా తెలిపారు. ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పోలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన రాజీనామాతో ఖాళీ అయిన చోట మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితున్ని తన స్థానంలో నిలబెడతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, కేటీఆర్‌తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు ప్రకటించడంపట్ల గంటా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ రావాలని కేటీఆర్‌ను, గంటా ఆహ్వానించారు. దీనిపై ఆలోచించి చెబుతానని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2021-03-25T21:34:33+05:30 IST