టాలీవుడ్‌కు ‘విశాఖ స్టీల్’ సెగ

ABN , First Publish Date - 2021-03-12T23:53:58+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.

టాలీవుడ్‌కు ‘విశాఖ స్టీల్’ సెగ

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి అన్నీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విశాఖ ఉక్కు ఉద్యమంలో మిన్నకుండిపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు టాలీవుడ్‌కు విశాఖ ‘స్టీల్’ సెగ తగిలింది. మంచు విష్ణు మూవీ 'మోసగాళ్లు' టీమ్‌ను ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించకుండా.. సినిమా షూటింగులు, సినిమా ఫంక్షన్ల కోసం ఏపీకి ఎవరొచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా.. సినిమా పెద్దలు నోరు మెదపకపోవడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’  అని నినాదాలు చేశారు. 



‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ మూడు దశాబ్దాల క్రితం ఊపిరి పోసుకున్న ఈ నినాదం.. ఇప్పుడు మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్రం తీరును ప్రశ్నిస్తూ ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. అయితే ఈ ఉద్యమంలో సినీ పరిశ్రమ ఎక్కడ? అని భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. సినిమా షూటింగ్‌లకు హాట్‌స్పాట్ విశాఖ. విభజన సమయంలో కొందరైతే విశాఖకు తరలి వెళతామంటూ తెరవెనుక చెప్పుకున్నారు. మరికొందరైతే స్టూడియోలు పెట్టుకుంటామన్నారు. అలాంటి విశాఖకు ఇప్పుడు కష్టం వచ్చిపడింది. మరి టాలీవుడ్ సినిమా పెద్దలకు ఈ కష్టం ఎందుకు కనిపించడంలేదు? స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి ట్వీట్ చేశారు. విశాఖ కార్మికులకు మద్దతు పలికారు. కానీ ఈ మద్దతు సరిపోతుందా? ఫైట్ చేయాల్సిన సమయంలో ట్వీట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అసలు టాలీవుడ్ పెద్దలు ఎందుకు నోరు మెదపడంలేదు? సినిమా ఇండస్ట్రీ ఎక్కడుంది? ఏం చేస్తోంది.



Updated Date - 2021-03-12T23:53:58+05:30 IST