విశాఖలో మితిమీరుతున్న వైసీపీ అరాచకాలు

ABN , First Publish Date - 2021-12-20T16:38:54+05:30 IST

విశాఖ: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి.

విశాఖలో మితిమీరుతున్న వైసీపీ అరాచకాలు

విశాఖ: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. తనను రక్షించాలంటూ విశాఖ హయగ్రీవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు అధినేత జగదీశ్వరుడు సెల్ఫీ వీడియోను విడుదల చేయడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్‌, విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ అరాచకాలు, బెదిరింపులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని జగదీశ్వరుడు తెలిపారు. 


స్మార్ట్‌ సిటీ చైర్మన్‌, ఆడిటర్‌ జీవీ తన ఆస్తిని మోసంతో కాజేసి తనను రోడ్డున పడేశాడని జగదీశ్వరుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. జి వెంకటేశ్వర రావు అలియాస్‌ జీవీ తమ కంపెనీకి 2004 నుంచి ఆడిటర్‌గా పనిచేస్తున్నారని... కొన్ని వ్యాపారాల్లో కలిసి పెట్టుబడులు పెట్టి... నష్టాలు తెచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు... తన సంస్థను, వందలాది మంది ఉద్యోగులను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోలో జగదీశ్వరుడు వేడుకున్నారు. 


సాగర్ నగర్  సమీపంలో ఎండాడ సర్వేనెంబర్‌లో ప్రభుత్వం నుంచి తీసుకున్న 12 ఎకరాల, భూమిని ప్రభుత్వ పెద్దలు విజయసాయి రెడ్డి, ఎన్‌సిసి, బే పార్క్, రాడిసన్ లాగానే, లాక్కుంటారని తమ చేతిలో ఉంటే ఎవరూ తీసుకోరంటూ బినామీ బ్రహ్మాజీ పేరిట బదలాయించారని... ఆ తర్వాత వాటిని అమ్మకం పెట్టారని జగదీశ్వరుడు ఆరోపించారు. గతంలో తమ వద్ద భూములు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు తనపై కేసులు వేస్తున్నారని వాటిని భరించే స్తోమత తనకు లేదన్నారు. దీనిపై జీవీని అడిగితే ముఖ్యమంత్రి, విజయసాయితో నేరుగా సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వంలో అనేక మంది పెద్దల ఆస్తులన్నీ తానే చూస్తున్నానంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రే తనను కాపాడాలని జగదీశ్వరుడు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-12-20T16:38:54+05:30 IST