విశాఖ భూకబ్జాలు.. ‘సిట్’ ఉన్నట్టా? లేనట్టా?

ABN , First Publish Date - 2020-09-25T18:02:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖ ప్రస్తుతం ఆర్థిక రాజధాని నుండి పాలనా రాజధానిగా మారింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి విశాఖ నగరానికి ఒక క్రేజ్ ఉంది. ఈ సాగరతీరానికి ఎవ్వరైనా...

విశాఖ భూకబ్జాలు.. ‘సిట్’ ఉన్నట్టా? లేనట్టా?

విశాఖలో భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఉన్నటా? లేనట్టా? ఇంతకీ దర్యాప్తు జరుగుతున్నట్టా? అటకెక్కినట్టా? అసలు సిట్ పరిస్థితి ఏమిటి? దానిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో.. ఈ కథనంలో చూద్దాం.


వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖ ప్రస్తుతం ఆర్థిక రాజధాని నుండి పాలనా రాజధానిగా మారింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి విశాఖ నగరానికి ఒక క్రేజ్ ఉంది. ఈ సాగరతీరానికి ఎవ్వరైనా ఒక్కసారి వస్తే చాలు.. ఇక్కడే ఉండిపోవాలనిపించే వాతావరణం విశాఖ సొంతం. మరోవైపు నగరం క్రమంగా విస్తరిస్తోంది. ఆసియాలో అత్యంత వేగంగా ఆభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా విశాఖ గుర్తింపు పొందింది. హుద్‌హుద్‌ తుపాను తర్వాత చేపట్టిన సుందరీకరణ పనులతో నగర సోయగం మరింత పెరిగింది. స్మార్ట్‌సిటీగా ఎదిగింది. అయితే నగరం చుట్టూ కొండలు, ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉండటంతో.. ఎన్నడు లేనివిధంగా భూములపై బడాబాబుల కళ్లు పడ్డాయి. అనుకున్నదే తడువుగా, చాలాచోట్ల ఆక్రమణలు, లీగల్ లిటిగేషన్స్ వంటివి పెట్టి భూములు దోచేయడం మొదలుపెట్టారు. అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. స్వపక్షంలో ఉన్నవారు సైతం నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాటి ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించింది. అంతకుముందే భూములను సర్వే చేయించి వివాదాలు ఉన్న భూముల సర్వే నెంబర్లను 22 ఏలో పెట్టింది. ఆ భూములు విషయంలో రిజస్ట్రేషన్ గానీ, అమ్మకాలు గానీ జరగడానికి వీలు లేకుండా నిషేధం విధించింది.


టీడీపీ హయాంలో వినిత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదికను సిద్ధం చేసింది. దాన్ని నాటి ప్రభుత్వానికి కూడా అప్పగించింది. సుమారుగా 4 వేల నుండి 5 వేల ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ నివేదికను బయట పెట్టలేదు. ఇంతలో 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ఆ నివేదికను బయట పెట్టలేదు. విశాఖపట్టణంలో భూకుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది అక్టోబరులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ఆధ్వర్యంలో వేసిన ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రజల నుండి పెద్దఎత్తున వినతులు స్వీకరించింది. సుమారుగా 1300 వరకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వివిధ కేటగిరిలుగా విభజించి విచారణ ప్రారంభించింది. పలు రెవెన్యూ కార్యాలయాల్లోని అన్ని విభాగాల నుండి రికార్డులను తెప్పించుకుని విచారణ అధికారులు పరిశీలించారు. ఇందులో చాలాచోట్ల భూములు ఆక్రమణలు జరిగినట్లు, మరికొన్నిచోట్ల రికార్డులు ట్యాంపరింగ్ అయినట్లు, కొన్ని భూముల విషయంలో అధికారులే కీలకంగా వ్యవహరించారనీ గుర్తించారట. 


ఇక ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యక్తుల రికార్డుల ట్యాంపరింగ్‌ను కూడా సిట్ గుర్తించిందట. జనవరి నెలలో మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. దీనిపై కూడా లోతైన విచారణ జరగాలనీ, ఎన్ఓసీతోపాటు రికార్డుల తారుమారు వంటి అనేక అంశాలు ఉన్నాయనీ, ఆక్రమణలు కూడా ఉన్నాయనీ తేల్చింది. అయితే అప్పుడు సిట్ గడువు ఫిబ్రవరితో ముగియడంతో.. దాన్ని మే నెల వరకు పొడిగించారు. తర్వాత మే నెలలో కూడా గడువు పూర్తయింది. కానీ ఇప్పటికీ మళ్లీ ఈ సిట్‌ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.  దీంతో  సిట్ ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానం మొదలైంది. సిట్ కార్యాలయంగా ఉన్న ఏలేరు గెస్ట్ హౌస్‌లోనే ఇప్పటికీ చాలా రికార్డులు అలాగే ఉన్నాయి. మరోవైపు వివిధ శాఖల నుండి డిప్యుటేషన్‌పై కొందరు ఆధికారులను ఇక్కడ నియమించారు. వారితోపాటు మరికొంతమంది సిబ్బందికి ఆ కార్యాలయంలో విధులకు వెళ్లి వస్తున్నారు. అయితే అక్కడ వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం సిట్ గడువును పొడిగిస్తుందా? లేక విచారణను అటకెక్కించినట్టా? అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-09-25T18:02:57+05:30 IST