Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవదాయ శాఖలో.. విచిత్ర ధోరణి!

ఇసుక చల్లిన అధికారిణికి అందలం

విశాఖ ఏసీ శాంతికి ఆలయ ఈఓగా పోస్టింగ్‌

మెమోలు ఇచ్చిన చేతితోనే అదనపు బాధ్యతల అప్పగింత

ప్రొబేషన్‌ కూడా పూర్తికాకుండా కోరినచోట పోస్టింగ్‌

అధికార పార్టీ నేత అండతోనే ఉన్నతాధికారులు మౌనం?!

దేవదాయ శాఖలో అరాచకం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో కింది నుంచి పైవరకు అరాచకం రాజ్యమేలుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించే విచిత్ర ధోరణి కనిపిస్తోంది. ఇటీవల తన పైఅధికారి అయిన డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ ముఖంపై ఇసుక చల్లిన విశాఖపట్నం అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి అందలమెక్కించడం తాజాగా విస్మయపరిచే అంశం. ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపడతారని అంతా భావిస్తే, రాజధాని అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో మౌనం దాల్చారు. దీనిని అవమానంగా భావించి సదరు డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు.


అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. దాంతో అసిస్టెంట్‌ కమిషనర్‌ మరింత విజృంభించారు. తనకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు సాక్ష్యాలు ఇస్తున్నారనే కారణంతో దిగువ స్థాయి సిబ్బందిని వేధించడం ప్రారంభించారు. ఒక ఉద్యోగిని కలెక్టరేట్‌కు సరెండర్‌ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫారసు చేశారు. ఆమె వేధింపులు భరించలేక ఏసీ కార్యాలయం ఉద్యోగులతో పాటు ఆలయ ఈఓలు సెప్టెంబరులో మూడు రోజులు సామూహిక సెలవులు పెట్టి ఆందోళనలు చేశారు. దాంతో రాజధాని అధికారులు మరోసారి రాజమండ్రి ప్రాంతీయ అధికారిని పంపి విచారణ జరిపించారు. ఆ తరువాత కొత్తగా వచ్చిన దేవదాయ శాఖ కమిషనర్‌ అక్టోబరు 13వ తేదీన ఏసీ శాంతికి చార్జిమెమో ఇచ్చారు.


తొమ్మిది అంశాలపై వివరణ కోరారు. దీనికి ఆమె సమాధానం ఇచ్చారో లేదో తెలియదు. ఆమెను నెల రోజుల్లో బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు మాత్రం హామీ ఇచ్చారు. అది నెరవేరలేదు సరికదా.. తాజాగా ఆమెకు జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ ఆలయం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె పాలన బాగోలేదని తొమ్మిది అంశాలతో వివరణ కోరిన అధికారులే.. ఇప్పుడు అదనంగా మరో బాధ్యత అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అక్కడే వివాదం మొదలు

తాజాగా ఏసీ శాంతి ఈఓగా అదనపు బాధ్యతలు వేయించుకున్న ఎర్నిమాంబ ఆలయమే వివాదాలన్నింటికీ కారణం. ఏడాదికి కోటి రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అనకాపల్లి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజుకు ఏడాది క్రితం ఆమె ఆ ఆలయ బాధ్యతలు అదనంగా అప్పగించారు. హుండీల సొమ్ము పక్కదారి పడుతున్నదని ఆరోపణలు రావడంతో అతడిని తప్పించి రాజగోపాలరెడ్డి అనే ఈఓను కొత్తగా నియమించారు. ఆయన కొవిడ్‌ కారణంగా ఆయన 15 రోజులు సెలవు పెట్టగా, ఈలోపు ఆయన ఆర్డర్‌ రద్దు చేసి, మళ్లీ ఆ స్థానంలో శ్రీనివాసరాజునే ఈఓగా వేశారు. సదరు శ్రీనివాసరాజును అనేక ఆరోపణలపై డీసీ పుష్పవర్ధన్‌ సస్పెండ్‌ చేశారు. శ్రీనివాసరాజు సస్పెన్షన్‌తో ఖాళీ అయిన ఈఓ పోస్టులో సీతమ్మధార షిర్డీసాయి ఆలయ ఈఓ కె.శిరీషకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆ ఆలయాన్ని ఎలాగైనా తిరిగి చేతికి తెచ్చుకోవాలని ఏసీ శాంతి అమరావతి స్థాయిలో ప్రయత్నించి సఫలమయ్యారు.


ప్రొటోకాల్‌ ఖర్చుల కోసమట

పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి అమరావతి నుంచి మంత్రితో పాటు ఉన్నతాధికారులు తరచూ వస్తున్నారని, వారికి ప్రొటోకాల్‌ ఖర్చులకు సిబ్బంది ఎవరూ సహకరించడం లేదని, అందుకని ఎర్నిమాంబ ఆలయ బాధ్యతలు తనకు అప్పగిస్తే...ఆ ఖర్చులు చూసుకుంటానని ఏసీ ఉన్నతాధికారులకు చెప్పి పోస్టింగ్‌ వేయించుకున్నారని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పదిహేను నెలల క్రితం ఉద్యోగంలో చేరి ఇంకా ప్రొబేషన్‌ పీరియడ్‌ కూడా పూర్తికాని అధికారిణికి కోరిన పోస్టింగులు ఇవ్వడం వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ దన్నుతోనే ఆమె ఉన్నతాధికారులను సైతం ధిక్కరిస్తున్నారని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement