Abn logo
Jul 7 2020 @ 13:44PM

ఆరోగ్యం బాగోలేదని చెల్లెలిని ఆస్పత్రికి తీసుకువెళ్తే.. దారుణం వెలుగులోకి..

మృగాళ్లు!

ఒంటరి బాలికపై ముగ్గురి అత్యాచారం 

నెలలుగా సాగుతున్న దౌర్జన్యం

బాలిక గర్భవతి కావడంతో వెలుగులోకి...

నిందితులపై అత్యాచారం, దిశ చట్టం కింద కేసులు 


ఎలమంచిలి(విశాఖపట్నం): అభం శుభం తెలియని వయసు... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి.. అయినవారు ఆదరించక... ఎలా బతకాలో తెలియక... చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతుకు ఈడుస్తున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధుల కన్ను పడింది. మాయమాటలతో ఆమెను లోబరుచుకున్నారు. కొద్ది నెలలుగా అకృత్యానికి పాల్పడ్డారు. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. ఆరోగ్యం బాగా లేదని తన సోదరి ఇంటికి చేరిన బాలికను అనుమానంతో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఆశ్రయించడంతో వారు గ్రామంలో విచారించి నిందితులపై కేసు నమోదు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ అకృత్యం ఎలమంచిలి మండలంలో చోటుచేసుకుంది. 


మండలంలోని కొత్తలి గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక (15)ను కొత్తలి, పురుషోత్తపురం గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. దీనిపై బాలిక ఈనెల 5న పోలీసులను ఆశ్రయించగా సోమవారం సీఐ నారాయణరావు గ్రామంలో విచారించి నిందితులపై కేసు నమోదు చేశారు. సీఐ, బాధితురాలు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కొత్తలి గ్రామంలోని ఓ కుటుంబంలో దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి తండ్రి 2015లో అనారోగ్యానికి గురై మృతి చెందగా, తల్లి కూడా ఏడాది తర్వాత అనారోగ్యంతోనే కన్నుమూసింది.


చిన్నతనంలోనే అనాథలుగా మిగిలిపోయిన వీరిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రాజమండ్రిలోని వారి పెద్దమ్మ తనతోపాటు తీసుకువెళ్లి ఆశ్రయమిచ్చింది. పెద్ద కుమార్తెకు మాకవరపాలెం సమీపంలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అక్కకు వివాహం కావడం, ఒంటరిగా వున్నానన్న కారణంతో రెండో కుమార్తె ఏడాది క్రితం రాజమండ్రి నుంచి కొత్తలిలో తన తాతగారి ఇంటికి వచ్చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి, ప్రస్తుతం ఒంటరిగా మిగిలిన ఆ మనుమరాలిని అక్కున చేర్చుకోవాల్సిన తాతయ్య, నాన్నమ్మలు పట్టించుకోకపోవడంతో గ్రామంలో ఒంటరిగానే జీవిస్తోంది. జీడిమామిడి తోటలో జీడి పిక్కలు ఏరడం, చీపురుపుల్లలు సేకరించి అమ్ముతూ కాలం నెట్టుకొస్తోంది. 


ఒంటరిగా తోటల్లోకి వెళుతున్న బాలికను కొత్తలికి చెందిన వై.శంకర్‌, బి.రమణ, పురుషోత్తపురం గ్రామానికి చెందిన కె.అప్పారావు మాయమాటలతో లోబరుచుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇటీవల తనకు ఆరోగ్యం బాగా లేదంటూ సోదరి ఇంటికి వెళ్లింది. ఆమెను చూసిన అక్క అనుమానంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆరు నెలల గర్భవతి అని చెప్పడంతో హతాశురాలయింది. దీంతో బాలికను తీసుకొని తన గ్రామానికి వచ్చి, తాతయ్య, నానమ్మల సమక్షంలో విచారించింది. బాలిక అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పింది.


స్థానిక పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో అక్కడ మరొకరి పేరు కూడా చెప్పింది. దీంతో గ్రామ మహిళా పోలీస్‌ ద్వారా ఎస్‌ఐకు సమాచారాన్ని అందజేశారు. పోలీసుల సమక్షంలో మూడో వ్యక్తి పేరును కూడా బాలిక వెల్లడించింది. దీంతో ఆ ముగ్గురిపై అత్యాచారం, దిశ చట్టం కింద కేసులు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. బాలికపై నిందితులు ముగ్గురూ సాగించిన అకృత్యం తెలిసిన గ్రామస్థులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement