వైసీపీలో కుమ్ములాట

ABN , First Publish Date - 2021-08-04T05:55:47+05:30 IST

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల..

వైసీపీలో కుమ్ములాట

సౌత్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్పొరేటర్ల గ్రూపు

టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కండువా కప్పుకున్న శాసనసభ్యుడు

ఇండిపెండెంట్లుగా గెలిచి ఫ్యాన్‌ కింద చేరిన కార్పొరేటర్లు

నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు

బడ్డీల తొలగింపులో బయటపడిన విభేదాలు

కార్యకర్తల్లో అయోమయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘సౌత్‌’లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా 39వ వార్డులోని ఎంవీడీఎం పాఠశాల వద్ద బడ్డీల తొలగింపును ఒకవర్గం వ్యతిరేకించగా, మరొక వర్గం సమర్థించింది. 


దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్‌కుమార్‌ టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై గెలుపొందారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీని వీడి ఆయన...వైసీపీకి మద్దతు ప్రకటించారు. తదనంతర కాలంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతి చెందడంతో నియోజకవర్గంలో క్రియాశీలకంగా మారారు. ఇదిలావుండగా ఈ ఏడాది మార్చిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 32, 35, 39 వార్డుల్లో వైసీపీ టిక్కెట్లు దక్కకపోవడంతో కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహ్మద్‌ సాదిక్‌ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వారంతా తిరిగి వైసీపీలో చేరి, కౌన్సిల్‌లో అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. తమ వార్డుల్లో ఎమ్మెల్యే వాసుపల్లి పెత్తనం ఎక్కువైపోయిందనే అసంతృప్తి వారిలో మొదలైంది. అలాగే ఆయా కార్పొరేటర్లు ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వడం లేదనే భావన వాసుపల్లిలో ఉంది. రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలు 39వ వార్డులోని ఎంవీడీఎం పాఠశాల వద్ద బడ్డీల తొలగింపు అంశంతో తారస్థాయికి చేరుకున్నాయి. ఆ బడ్డీలను తొలగించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఇతర అధికారులకు వార్డు కార్పొరేటర్‌ సాదిక్‌ పలుమార్లు విజ్ఞప్తిచేశారు.


అక్కడ గంజాయి, మద్యం, మత్తుపదార్థాలు విక్రయిస్తుండడం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని కార్పొరేటర్‌ పేర్కొనడంతో జీవీఎంసీ అధికారులు నెల కిందట బడ్డీలను తొలగించేందుకు యత్నించారు. దీనికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తోపాటు ఆ వార్డు వైసీపీ నాయకులు అడ్డుతగిలారు. దీంతో జీవీఎంసీ అధికారులు వెనుతిరిగివెళ్లిపోయారు. సోమవారం తెల్లవారుజామున పోలీసుల సహాయంతో జీవీఎంసీ అధికారులు ఆ బడ్డీలను తొలగించేశారు. దీనిపై ఎమ్మెల్యే వాసుపల్లి తీవ్రంగా స్పందిస్తూ జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనతోపాటు కార్పొరేటర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కార్పొరేటర్లు మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. 


తలలు పట్టుకుంటున్న పార్టీ నేతలు

నియోజకవర్గంలో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి బహిరంగ విమర్శలకు దిగుతుండడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి, కార్పొరేటర్లు ఇండిపెండెంట్లుగా గెలిచి తమ ప్రయోజనాల కోసం తమ పార్టీలో చేరి ఇప్పుడు కొట్లాటకు దిగి పరువును బజారుకీడుస్తున్నారని అంటున్నారు. తాజా పరిణామం పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం  జోక్యం చేసుకుని నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలకు తెరదించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - 2021-08-04T05:55:47+05:30 IST