విశాఖ ఉక్కుపై ఈసారైనా గళమెత్తుతారా?

ABN , First Publish Date - 2021-03-08T10:09:13+05:30 IST

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలిదశలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు మాట్లాడలేదని.. కనీసం సోమవారం నుం చి

విశాఖ ఉక్కుపై ఈసారైనా గళమెత్తుతారా?

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

జగన్‌ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి


అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలిదశలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు మాట్లాడలేదని.. కనీసం సోమవారం నుం చి మొదలయ్యే రెండో విడత సమావేశాల్లోనైనా వారు గట్టిగా గళమెత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై పట్టుబట్టాలని అడుగుతున్నారు. ఈ హామీలిచ్చే వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సీఎం అయ్యారని గుర్తుచేస్తున్నారు. ‘రాష్ట్రంలో పారిశ్రామికరంగ అభివృద్ధితో యువతకు ఉద్యోగాలు సహా సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే హోదా ప్రకటించాల్సిందే. సార్వత్రిక ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాను సాధించితీరతాం. రాష్ట్రం లో పారిశ్రామిక ప్రగతి సాధించడం వల్ల నిరుద్యోగమే లేకుండా చేస్తాం’ అని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన చెప్పడం తెలిసిందే.


దాంతో వారు 2019 ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులను.. 22 మంది ఎంపీలను వైసీపీకి కట్టబెట్టారు. ఇక ప్రత్యే క హోదాను జగన్‌ తీసుకురాడమే తరువాయని అనుకున్నారు. కానీ .. ఘన విజయం సాధించి ఢిల్లీ వెళ్లిన మొదటిసారే ఆయన మాటమార్చారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి 21 నెలలు గడచిన దరిమిలా.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యం లో సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో వైసీ పీ అనుసరించబోయే వ్యూహాలపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేయొద్దంటూ బీజేపీయేతర పక్షా లు ఇటీవల బంద్‌ నిర్వహించాయి. ఈ బంద్‌కు వైసీపీ మద్దతు పలికింది కూడా. ఉక్కు కర్మాగారం ప్రభుత్వరంగ సంస్థగానే ఉండే లా కేంద్రంతో కడదాకా పోరాడతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇదే మాటతో విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచా రం చేసుకుంటున్నారు. మరి ఈ దూకుడును వైసీపీ పార్లమెంటులో చూపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోదా కోసం వైసీపీ ఎంపీలు ఇంతవరకు పార్లమెంటులో గట్టిగా అడిగిన సందర్భం లేదు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం.. పెట్టుబడులు రాకపోవడంతో హోదా ఇవ్వాలంటూ ప్రధానిని వైసీపీ ఎంపీలు నిలదీయగలరా అనేది ఆసక్తిగా మారింది. ఇక పోలవరం తుది అంచనా వ్యయం ఆమోదానికి దిక్కులేకుండా పోయింది. రూ. 55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించాలని సీఎం జగన్‌ ప్రధానికి ఓ లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ ప్రధానాంశాలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో గళం విప్పుతారో.. చూడాలని ప్రజలు అంటున్నారు.

Updated Date - 2021-03-08T10:09:13+05:30 IST