విశాఖ ఉక్కు అమ్మకం ఆగదు

ABN , First Publish Date - 2021-08-03T07:17:06+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర

విశాఖ ఉక్కు అమ్మకం ఆగదు

పునఃసమీక్ష ప్రసక్తే లేదని పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ


న్యూఢిల్లీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ రావు కిషన్‌ రావు కరాడ్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి చెప్పారు. జనవరి 27న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలోనే విశాఖ ఉక్కు ప్లాంట్‌, దాని అనుబంధ సంస్థలు, ఉమ్మడి సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.


ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంస్థల్లో ప్రస్తుత ఉద్యోగులు, ఇతర లబ్ధిదారుల న్యాయపూరిత ఆందోళనలకు వాటాల కొనుగోలు ఒప్పందాల ద్వారా తగిన పరిష్కారం లభించేలా చూస్తామన్నారు. 2021లో ప్రవేశపెట్టిన నూతన ప్రభుత్వ రంగ సంస్థల విఽధానం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్ని వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర సంస్థలుగా వర్గీకరించామని, వ్యూహాత్మక సంస్థల్లో కొన్నిటికి మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థలకు హోల్డింగ్‌ కంపెనీ స్థాయిలో కనీస ఉనికి ఉంటుందని, మిగతా వాటిని ప్రైవేటీకరించడమో, ప్రస్తుత సంస్థ ల్లో విలీనం చేయడమో, మూసివేయడమో జరుగుతుందని వివరించారు. వ్యూహాత్మకేతర సంస్థల్లో సాధ్యమైనన్నింటిని ప్రైవేటీకరిస్తామని, మిగతా వాటిని మూసేస్తామని చెప్పారు. ఉక్కు పరిశ్రమ వ్యూహాత్మకేతర రంగం కిందకు వస్తుందని, విశాఖ ఉక్కు రూ.1369.01 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. 




హస్తినలో ‘ఉక్కు’ గర్జన


‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు‘ నినాదం జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిధ్వనించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం తొలిరోజు చేపట్టిన ధర్నా.. పోలీసు ఆంక్షలు, వేధింపులు, నిర్బంధాల నడుమ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. పదేళ్లు వీరోచితంగా పోరాడి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల ముసుగులో ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆందోళనకారులు కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా రాజీలేని పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని శపథం చేశారు.


విశాఖ నుంచి ఢిల్లీకి తరలి వచ్చిన ఉద్యోగులు, ఆందోళనకారులను ఆదివారం రాత్రి నుంచే ఢిల్లీ పోలీసులు అనేక కుంటిసాకులతో రైల్వేస్టేషన్‌ వద్దే అడ్డుకోవడం, హోటళ్లలో బస చేయకుండా ఇబ్బంది పెట్టడం, దాదాపు రెండున్నర గంటలు నిర్బంధించడం తదితర చర్యలతో వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన  వామపక్షపార్టీల జాతీయ నాయకుల జోక్యంతో  ఎట్టకేలకు పోలీసులు వారిని నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. ఈ ధర్నాలో దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొన్నారు.


ధర్నాలో వామపక్ష నేతలు, వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్టీల్‌ప్లాంటు జేఏసీ నేతలు  తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ, సీపీఐ, సీపీఎం, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా నేతలు కూడా పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. 


Updated Date - 2021-08-03T07:17:06+05:30 IST