విశాఖ ఉక్కుకు కేంద్రం పొగ

ABN , First Publish Date - 2020-11-22T08:05:20+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థలను పక్కనపెట్టి.. ప్రైవేటుకు పెద్దపీట వేస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. విశాఖ ఉక్కుకూ పొగ పెడుతోంది. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న

విశాఖ ఉక్కుకు  కేంద్రం పొగ

ప్రభుత్వ ఫ్యాక్టరీని కాదని పోస్కోకు ప్రాధాన్యం

హైగ్రేడ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతామంటున్న పోస్కో

విశాఖ ఉక్కు భూములు దక్షిణ కొరియా కంపెనీకి

1,170 ఎకరాలు కోరిన పోస్కో

900 ఎకరాలు కేటాయింపు

విశాఖ ఉక్కు మూడో దశకు కేంద్రం మోకాలడ్డు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వరంగ సంస్థలను పక్కనపెట్టి.. ప్రైవేటుకు పెద్దపీట వేస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. విశాఖ ఉక్కుకూ పొగ పెడుతోంది. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అంటూ రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని పట్టించుకోకుండా దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ అభివృద్ధికి ఎక్కడాలేని ప్రాధాన్యం ఇస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన విలువైన భూములను పోస్కో కంపెనీకి కట్టబెడుతోంది. హైగ్రేడ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటున్న పోస్కోకు ఇప్పటికే 900 ఎకరాలను కేటాయించింది. మరో 900 ఎకరాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం విశాఖ ఉక్కు కర్మాగారం మూడో దశ విస్తరణ ప్రతిపాదనలనూ పక్కనపెట్టేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం నోరుమెదపడం లేదు. 


ఇదీ పోస్కో కథ: ఒడిశాలో పదిహేనేళ్ల్లు యత్నించినా ప్లాంటు పెట్టుకోవడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతో ఏపీకి వచ్చిన పోస్కోకు కేంద్రం అండగా నిలిచింది. విశాఖ ఉక్కు కర్మాగారం దగ్గర 26 వేల ఎకరాల భూములు, పోర్టు నిర్మించుకోవడానికి అనువైన స్థలం ఉండడంతో ‘హైగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌’ ఏర్పాటు పేరుతో విశాఖ ఉక్కుతో ఒప్పందం చేయించింది. ఏడాదికి 50 లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేయడానికి ‘పోస్కో’ కంపెనీ రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చెబుతున్నారు. ఇందుకు 1,170 ఎకరాలు కావాలని కోరారు. ఇప్పటికే 900 ఎకరాలు కేటాయించారు. ఈ భూములను పోస్కోకు అమ్ముతున్నారో.. లీజుకు ఇస్తున్నారో తెలియదు. ఆ కంపెనీ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందో కూడా తెలియదు. మరోవైపు విశాఖ ఉక్కు తీసుకున్న బ్యాంకు రుణాలన్నీ తీర్చేయాలని చెబుతున్న కేంద్రం, పోస్కోకు కేటా యించిన భూములపై రుణాలు తెచ్చుకోవడానికి అం గీకారం తెలిపింది. 


పోర్టు నిర్మాణ భూములు పోస్కోకు.. 

సొంతంగా 3 బెర్తులతో పోర్టు నిర్మించుకుంటా మంటూ మూడో దశ విస్తరణ ప్రతిపాదనలను విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాం ఉండగా.. మరో 32 లక్షల టన్నులు పెంచుకుంటామని తెలిపింది. వీటిపై స్పందించని కేంద్రం.. విశాఖ ఉక్కు పోర్టు నిర్మాణానికి ఉద్దేశించిన భూములను పోస్కోకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి గతంలో 400 ఎకరాలు తీసుకొని గంగవరం పోర్టుకు అప్పగించారు. మరోవైపు విశాఖ ఉక్కుకు ఐరన్‌ ఓర్‌ గనులు కేటాయించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదు. అంతేగాకుండా జగ్గయ్యపేట, మాధవరంలలో విశాఖ ఉక్కుకు ఉన్న లైమ్‌స్టోన్‌ (సున్నపురాయి) గనులను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.


భూములిచ్చిన వారికి  ఉద్యోగాలు ఇస్తారా?: డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ

విశాఖ ఉక్కు కోసం 13 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారికి కర్మాగారంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు భూములు తీసుకునే పోస్కో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తుందా? రిజర్వేషన్లు అమలు చేస్తుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఇది భూములతో వ్యాపారం తప్పితే ఇంకోటి కాదు.


ప్రైవేటీకరణ కోసం కుట్ర: బి.గంగారావు, కార్యదర్శి, సీపీఎం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోంది. అందుకే సున్నపురాయి గనులను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కన్సల్టెన్సీని కూడా నియమించారు. ఉత్తరాంధ్రను దెబ్బతీసే ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది.

Updated Date - 2020-11-22T08:05:20+05:30 IST