Jul 24 2021 @ 19:24PM

‘ఎనిమీ’ టీజర్: ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా?

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. శనివారం ఈ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఒక నిమిషం న‌ల‌భై సెకండ్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటడమే కాకుండా నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌రులో తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

 

టీజర్ విషయానికి వస్తే.. స్టైలిష్ లుక్‌లో విశాల్ ఎంట్రీతో ప్రారంభమైందీ టీజ‌ర్. విశాల్, ఆర్య‌ల హై ఓల్టేజ్ యాక్ష‌న్ ప్యాక్డ్‌ పెర్‌ఫామెన్స్‌లు ఈ టీజ‌ర్‌కి హైలెట్‌గా నిలిచాయి. ఇక టీజ‌ర్ చివ‌ర‌లో ‘ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే ..’ అని ప్ర‌కాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఈ టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఆర్‌ డి రాజశేఖర్ విజువ‌ల్స్,  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రిచ్‌గా ఉన్నాయి. టోటల్‌గా ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేదిగా ఉంది.