కొడాలి నానిని తప్పించే వరకు‌ బీజేపీ ఊరుకోదు: విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-24T00:48:54+05:30 IST

ప్రధాని మోదీ, యూపీ సీఎంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయాలని చిల్లరగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కొడాలి నానిని తప్పించే వరకు‌ బీజేపీ ఊరుకోదు: విష్ణువర్థన్‌రెడ్డి

విజయవాడ: ప్రధాని మోదీ, యూపీ సీఎంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయాలని చిల్లరగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘సినిమా నిర్మాత కాబట్టి.... ప్రజాస్వామ్యం కూడా సినిమా అనుకుంటున్నారు. నేటి వ్యాఖ్యలు ద్వారా కొడాలి నాని రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు.. జగన్ ట్రాప్‌లో పడి 2019లో ఓడిపోయారు. నేడు చంద్రబాబు వేసిన ట్రాప్‌లో జగన్ పడినట్లున్నారు. కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అయ్యింది.విమర్శలు వస్తున్నా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారంటే మాకు కుట్ర అనుమానం ఉంది. ఏపీలో పూటకో భాష, పూటకో వేషం వేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంతర్వేదిలో భక్తులుపై కేసులు పెడితే... ఈ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ మాత్రమే హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా పోరాటం చేశాయి. టీడీపీ పడగొట్టిన ఆలయాల నిర్మాణం చేపడతామని ప్రకటించడం వెనుక  ప్రభుత్వం కుట్ర ఉంది. దేవాదాయ ‌భూములు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంచి పెడుతుంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తన ఇంటి ఎదురు ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేయలేక పోయారు. టీటీడీకి చెందిన ఐదు‌వేల కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే తరహాలో క్రిస్టియన్, ముస్లింల ఆస్తులు తీసుకుని పంచగలరా? బీజేపీకి మీలాగా మత రాజకీయాలు చేయడం అలవాటు లేదు’ అని పేర్కొన్నారు.


‘ప్రజలను రెచ్చగొట్టేలా నాని వ్యాఖ్యలు చేస్తే డీజీపీ కేసు ఎందుకు పెట్టలేదు. చర్చి మీద రాళ్లు వేశారని 41 మందిపై కేసు పెట్టిన పోలీసులకు నాని వ్యాఖ్యలు కనిపించవా? మీ మంత్రి విచ్చలవిడిగా మాట్లాడుతుంటే జగన్ స్పందించరా? భారత రాజ్యాంగం, చట్టాలు కొడాలి నానికి వర్తించవా? సీఎం స్పందించి నానిని బర్తరఫ్ చేయకుంటే.. ఆయనను అడ్డుకుంటాం. 24గంటల్లో నానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.కొడాలి నానికి సవాల్ విసురుతున్నాం. ప్రజా క్షేత్రంలోనే సంగతి తేలుస్తాం. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ను డిక్లరేషన్ అడగలేదు. ఆ రెండు పార్టీలు తరహాలో మత రాజకీయాలు మేము‌ చేయం. ఇతర మతస్తులు ఎవరైనా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి. వైసీపీ, టీడీపీలు హిందూ ద్రోహులు... సంప్రదాయాలు కొనసాగించాలని మేం కోరుతున్నాం. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కు మాకున్నా చంద్రబాబు ముందే వచ్చారు. వైసీపీలో పిచ్చి పట్టిన వారు కొంతమంది మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ సహకారంతో హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి. కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదనేది స్పష్టం. మాతో పెట్టుకున్న చంద్రబాబు ఏమయ్యారో.. నాని తెలుసుకోవాలి. కొడాలి నానిని  మంత్రి పదవి నుంచి తప్పించే వరకు‌ బీజేపీ ఊరుకోదు’ అన్నారు.

Updated Date - 2020-09-24T00:48:54+05:30 IST