విశ్వ హిందూ మహాసభ చీఫ్‌‌‌‌‌‌‌ కాల్చివేత

ABN , First Publish Date - 2020-02-02T15:22:58+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘాతుకం చోటుచేసుకుంది. విశ్వ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్‌పై ఆదివారం ఉదయం ఆగంతకులు కాల్పులు జరపడటంతో..

విశ్వ హిందూ మహాసభ చీఫ్‌‌‌‌‌‌‌ కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘాతుకం చోటుచేసుకుంది. విశ్వ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్‌పై ఆదివారం ఉదయం ఆగంతకులు కాల్పులు జరపడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. హజ్రత్ గంజ్ ప్రాంతంలోని గ్లోబ్ పార్క్‌ వద్ద ఈ దారుణం చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన ఆగంతకులు ఆ వెనువెంటనే పరారైనట్టు చెప్పారు. కాల్పుల్లో తలకు తీవ్రంగా గాయమైన రంజిత్ బచ్చన్‌ను సమీపంలోని ట్రౌమా సెంటర్‌కు తరలించినప్పటికీ ఆప్పటికే ఆయన కన్నుమాశారు. రంజిత్ బచ్చన్ గోరఖ్‌పూర్ వాసి.


రంజిత్‌ బచ్చన్‌తో పాటు దుండగులు ఆయన సోదరుడిపై కూడా కాల్పులు జరిపారు. ఆయన కూడా గాయపడటంతో ట్రౌమా ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు, క్రైమ్‌బ్రాంచ్‌‌కు చెందిన ఆరు బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి.


దీనికి ముందు గత ఏడాది అక్టోబర్‌లో హిందూ సమాజ్ పార్టీ నేత కమలేష్ తివారీని సైతం లక్నోలోని నాకా ప్రాంతంలో ఆయన ఇంటి బయటే ఇద్దరు ఆగంతకులు కాల్చిచంపారు. 

Updated Date - 2020-02-02T15:22:58+05:30 IST