విజన్‌ 2023

ABN , First Publish Date - 2021-06-23T09:01:30+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా?

విజన్‌ 2023

  • శాసనసభ ఎన్నికలే లక్ష్యం
  • ఇప్పట్నుంచే కేసీఆర్‌ వ్యూహాత్మక అడుగులు
  • ‘ఏపీ ప్రాజెక్టులపై తాడోపేడో’ ప్రకటనా అందుకే?
  • మళ్లీ సెంటిమెంట్‌ను రగిలించే ఎత్తుగడ
  • బీజేపీ, కాంగ్రెస్‌, షర్మిల పార్టీకి చెక్‌ పెట్టే యోచన
  • టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీతో రాష్ట్రంలో బీజేపీ మంచి జోష్‌లో ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికార పీఠం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరస ఓటములు ఎదురవుతున్నా, కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం 2023 ఎన్నికల్లో అధికారం తమదే అంటున్నారు! దొర పాలనకు చరమగీతం పాడతామని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని వైఎస్‌ షర్మిల చెబుతున్నారు. కొత్త పార్టీ పెడుతున్న ఆమె.. ఇప్పటికే వేగంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, షర్మిల పార్టీ.. అందరి లక్ష్యం అధికారమే! వీరికి చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ రెండున్నరేళ్ల ముందే రంగంలోకి దిగారు! రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు!


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? పాలనలో వేగం పెంచడం, రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టడానికి ‘విజన్‌ 2023’నే కారణమా? అంటే అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఏపీ ప్రాజెక్టులపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించడం వెనక బహుళ లక్ష్యాలు ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. తాడోపేడో తేల్చుకోవాలనడం ద్వారా.. ‘కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌ గట్టిగా పోరాడడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది, నిలబడేది టీఆర్‌ఎస్‌ మాత్రమే’ అనే సందేశం ఇచ్చినట్లు అయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు  పేర్కొంటున్నాయి. 


ఏపీ సర్కారు జల దోపిడీకి పాల్పడుతూ తెలంగాణను గోస పుచ్చుకుంటోందని చెప్పడం ద్వారా ఇక్కడి ప్రజల్లో మరోసారి సెంటిమెంట్‌ రగలడానికి అవకాశం ఉంటుందని, అది అంతిమంగా వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సకి రాజకీయంగా ఉపయోగపడుతుందని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఇరుకున పెడుతుందని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2023లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇందుకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఏడాది కాలాన్ని రాజకీయంగా లెక్కలోకి తీసుకోరు. దాన్ని ఎన్నికల సంవత్సరంగానే పరిగణిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, ఇప్పటికే చేపట్టిన, చేపట్టబోయే పనులు పూర్తి చేయడానికి ఇక ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ ఈ మధ్య తన ను కలుస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలవద్ద 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తున్నారని తెలిసింది.


 ఆ ఎన్నికలకు సమాయత్తమవడానికి ఎక్కువ సమయం లేదనే ఉద్దేశంతోనే ఆయన ఇటీవల పాలన లో వేగాన్ని పెంచారని అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. తాజాగా కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఆంక్షలు సడలించడంతో రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడే దిశగా సాగుతోంది. ఈ క్రమంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పూర్తయిన నిర్మాణాల ప్రారంభోత్సవాలకు సీఎం కేసీఆర్‌ ఆదివారం శ్రీకారం చుట్టారు. దీన్ని రాబోయే రోజుల్లో కొనసాగించబోతున్నారు. అదే సమయంలో ఆయన రాజకీయంగానూ ప్రయోజనం పొందే నిర్ణయాలను తీసుకోవడంలో దూకుడు ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. 


ఆ పార్టీలకు చెక్‌ పెట్టేందుకే!

కృష్ణా బేసిన్‌లో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్ర మ ప్రాజెక్టులను నిలువరించడానికి ఎక్కడిదాకైనా పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం వెనక రాజకీయ కోణాన్ని కూడా చూడాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాణించిన తర్వాత టీఆర్‌ఎ్‌సతో కయ్యానికి కాలు దువ్వుతోంది. 2023 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉంది. మరోవైపు వరుస ఓటములు, అంతర్గత కలహాలతో నానాటికీ తీసికట్టుగా మారుతున్న కాంగ్రెస్‌ కూడా వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఏపీ సీఎం జగన్‌ సోదరి షర్మిల తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ప్రారంభిస్తున్నారు. ఈ పార్టీలన్నింటినీ ఒకే దెబ్బకు ఆత్మరక్షణలో పడేయడానికి, ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. 



Updated Date - 2021-06-23T09:01:30+05:30 IST