రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమయ్యే విటమిన్..

ABN , First Publish Date - 2020-06-22T20:32:42+05:30 IST

బి విటమిన్‌ ప్రాధాన్యం ఏమిటి? దాని కోసం ఏ ఆహారం తీసుకోవాలి?

రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమయ్యే విటమిన్..

ఆంధ్రజ్యోతి(22-06-2020)

ప్రశ్న: బి విటమిన్‌ ప్రాధాన్యం ఏమిటి? దాని కోసం ఏ ఆహారం తీసుకోవాలి?


- శ్రీవాణి, వైజాగ్‌


డాక్టర్ సమాధానం: బి విటమిన్‌ అనేది ఒకే విటమిన్‌ కాదు. ఎనిమిది విటమిన్ల సముదాయం. అందుకే బీ కాంప్లెక్‌ అంటారు. అవి బి- 1(థయామిన్‌), బి- 2(రిబోఫ్లావిన్‌), బి- 3  (నియాసిన్‌), బి- 5(పాంటోథెనిక్‌ ఆసిడ్‌), బి- 6(పిరిడాక్సిన్‌), బి- 7(బయోటిన్‌), బి- 9(ఫోలిక్‌ యాసిడ్‌), బీ- 12(కొబాలమిన్‌). శరీరంలో జరిగే జీవరసాయన ప్రక్రియలకు ఈ బీ విటమిన్లు అత్యవసరం. ఎర్రరక్తకణాల తయారీకి ఇవి కీలకం. బీ విటమిన్ల లోపం వల్ల బెరి-బెరి, అనీమియా, డిప్రెషన్‌, దీర్ఘకాలిక అలసట, రోగనిరోధకశక్తి తగ్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. బి- 1, బి- 2 గుడ్లు, పాలు, ముడిధాన్యాలు, ఆకుకూరల్లో; బి- 3 ఎక్కువగా చికెన్‌, చేపలు, మాంసం, ముడిధాన్యాలు, వేరుశెనగపప్పులో; బీ- 5 బ్రకోలి, క్యాబేజీ, బంగాళా దుంప, చిలగడ దుంప, పుట్టగొడుగులు, పప్పు ధాన్యాలు, చికెన్‌, పాలు, గుడ్లలో లభిస్తుంది. బి- 6 ను పాలకూర, పుచ్చకాయ, బంగాళా దుంపలు, ముడి ధాన్యాలు, గింజలు, పప్పులు, చికెన్‌, చేప, మాంసం; బి- 7 ను కాలేయం, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు; బి- 9 - మాంసం, ముడి ధాన్యాలు, బీట్రూట్‌, చేపలు, బత్తాయి, నారింజ పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాల ద్వారా లభ్యమవుతుంది. బి- 12 కేవలం జంతువుల నుండి వచ్చే పాలు, గుడ్లు, చేపలు, మాంసం ద్వారా లభ్యమవుతుంది. రోజూ సమతులాహారం తీసుకున్నట్లయితే ఏ రకమైన బి- విటమిన్‌ లోపం లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా లోపం ఉన్నట్టయితే నిపుణుల సలహాతో బి- కాంప్లెక్‌ సప్లిమెంట్లు తీసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-22T20:32:42+05:30 IST