వృద్ధుడు కాదు.. ఉక్కులాంటోడు!

ABN , First Publish Date - 2021-11-29T08:30:32+05:30 IST

వయసు కేవలం ఒక అంకె మాత్రమే. పట్టుదల ఉంటే బండరాళ్లను కూడా మన బాడీపై పిండిపిండి చేయించుకోవచ్చు. ఇవేవో గాలికబుర్లు కాదండోయ్‌.. డాక్టర్‌ కృష్ణ ఎద్దుల అనే ఓ 70 ఏళ్ల ఉక్కులాంటి మనిషి సాధించిన ఘనత ఇది.

వృద్ధుడు కాదు.. ఉక్కులాంటోడు!

  • ఇనుప మేకులపై పడుకుని..
  • ఛాతీపై 159 బండరాళ్లు..
  • పగులకొట్టించుకుని నాలుగు ప్రపంచ రికార్డుల్లోకి!
  • వివేకా ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ కృష్ణ అరుదైన ఘనత


బర్కత్‌పుర, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వయసు కేవలం ఒక అంకె మాత్రమే. పట్టుదల ఉంటే బండరాళ్లను కూడా మన బాడీపై పిండిపిండి చేయించుకోవచ్చు. ఇవేవో గాలికబుర్లు కాదండోయ్‌.. డాక్టర్‌ కృష్ణ ఎద్దుల అనే ఓ 70 ఏళ్ల ఉక్కులాంటి మనిషి సాధించిన ఘనత ఇది. సైదాబాద్‌లోని వివేకా ఆసుపత్రి ఎండీగా ఉన్న ఆయన, స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఇనుప మేకుల శయ్యపై పడుకుని 159 బండరాళ్లను తన ఛాతీపై పగులకొట్టించుకున్నారు. అది కూడా కేవలం ఏడు నిముషాల్లోనూ ఈ ఘనత సాధించి, 4 ప్రపంచ రికార్డుల్లో తన పేరును నమోదు చేశారు. ఈ అద్భుత కరాటే ప్రదర్శనకు నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు స్కూల్‌ వేదికగా నిలిచింది. జీవీఆర్‌ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.ఎస్‌. గోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


జీవీఆర్‌ కరాటే అకాడమీలోనే శిక్షణ పొందిన కృష్ణ, ఒకవైపు కరాటేలో రికార్డులు సాధిస్తూనే, మరోవైపు శ్రీశైలం నల్లమల అడవుల్లో గిరిజనులకు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి మందులను ఉచితంగా అందజేస్తుండటం విశేషం. వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, జై ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, విశ్వం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, డైమండ్‌ ఓల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కృష్ణ పేరు నమోదైంది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బూర్గుల మధుసూదన్‌ ఈ రికార్డుల గుర్తింపు పత్రాలను కృష్ణకు ప్రదానం చేశారు.  

Updated Date - 2021-11-29T08:30:32+05:30 IST