విశాఖ విమానాశ్రయం మూసేయాలా?

ABN , First Publish Date - 2020-11-20T06:04:29+05:30 IST

విశాఖపట్నంలో పౌర విమానాశ్రయాన్ని మూసేయాలా?..

విశాఖ విమానాశ్రయం మూసేయాలా?

- విజయసాయిరెడ్డిపై భగ్గుమంటున్న జనం

- భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తరువాత 30 ఏళ్ల పాటు విశాఖలో పౌర విమానాశ్రయాన్ని మూసివేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరిన సాయిరెడ్డి

- ప్రయాణికుల అభిప్రాయంతో పని లేదా అనే ప్రశ్నలు

- ఎవరి మేలు కోసం ఈ నిర్ణయాలు... అంటూ విమర్శలు

- అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తే ఎంతో వ్యయప్రయాస... సమయం, డబ్బు.... రెండూ వృథా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): 

విశాఖపట్నంలో పౌర విమానాశ్రయాన్ని మూసేయాలా?

భోగాపురం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించాలా?

ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకోరా?

ఇదంతా ఎవరి మేలు కోసం చేస్తున్నారు?

...ఇవీ ప్రస్తుతం విశాఖపట్నంలో విమాన ప్రయాణికుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖా మంత్రి హరదీప్‌సింగ్‌ పూరీని కలిసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నామని, అక్కడ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి 30 ఏళ్లపాటు విశాఖలో పౌర విమానాశ్రయాన్ని మూసేయాలని కోరారు. దీనికి సహకరించాలంటూ ఓ లేఖ సమర్పించారు. ఇప్పుడు ఇది విశాఖలో చర్చనీయాంశంగా మారింది.


50 కి.మీ. దూరంలో భోగాపురం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించబోయే విమానాశ్రయం విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణానికి సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. విమాన ప్రయాణం చేసేవారికి సమయం చాలా విలువైనది. అందుకే ఖర్చు ఎక్కువైనా విమానాలను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, తిరుపతి తదితర నగరాలకు కేవలం గంట నుంచి గంటన్నరలో ప్రయాణం ముగుస్తోంది. టిక్కెట్‌ రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య దొరుకుతోంది. ఇలాంటి ప్రయాణికులు భోగాపురం నుంచి రాకపోకలు సాగించాలంటే...అక్కడి నుంచి సిటీలోకి రావడానికి ట్యాక్సీ తీసుకోవాలి. దీనికి కనీసం రూ.2 వేలు తీసుకుంటారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి నగరంలోకి రావడానికి రూ.200 మాత్రమే ఖర్చు అవుతోంది. ఇకపై అది పది రెట్లు పెరిగి రూ.2 వేలు అవుతుంది. అంటే విమానం టిక్కెట్‌ ఖరీదులో సగం ట్యాక్సీకి పెట్టాలి. పైగా సమయం వృథా. కొత్త విమానాశ్రయం కాబట్టి వారి వ్యయం రాబట్టుకోవడానికి యూజర్‌ చార్జీల భారం ఎలాగూ పడుతుంది. అంటే అన్నీ కలుపుకొని మరో టిక్కెట్‌ భారం భరించాల్సి వస్తుంది. కొత్తగా వచ్చే విమానాశ్రయం వల్ల డబ్బు ఆదాతో పాటు సమయం కూడా కలిసి రావాలే తప్ప, అదనపు భారం కాకూడదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. విశాఖలో ఏ ఒక్కరూ భోగాపురంలో విమానాశ్రయం కోరుకోవడం లేదని కూడా చెబుతున్నారు. 


రూ.60 కోట్లతో విస్తరించేది మూసేయడానికా??

విశాఖ విమానాశ్రయం నౌకాదళం ఆధ్వర్యంలో నడుస్తోంది. పౌర విమానాల వ్యవహారాలన్నీ ఐఎన్‌ఎస్‌ డేగా అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అయితే విమానాశ్రయం అభివృద్ధి, ప్రయాణికులకు వసతులు వంటివి ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా చూస్తోంది. విశాఖ విమానా శ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని గత ఏడాది ఫిబ్రవరిలోనే రూ.60 కోట్లతో విస్తరణకు శంకుస్థాపన చేశారు. కరోనాకు ముందు నెలకు 2.5 లక్షల మంది ప్రయాణించేవారు. అంటే రోజుకు ఎనిమిదివేల మంది. విశాఖ విమానాశ్రయంలో 20 వేల చ.మీ. విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనం వుండగా, అదనంగా మరో పది వేల చ.మీ. భవనం నిర్మిస్తున్నారు. పార్కింగ్‌ బేలు కొత్తవి ఆరు పూర్తి కాగా మరో ఆరు నిర్మితమవుతున్నాయి. ఇవి పూర్తయితే ఒకేసారి 12 విమానాలు రాకపోకలు సాగించగలుగుతాయి. గంటకు మూడు వేల మంది రాకపోకలు సాగించవచ్చు. అలాగే ఇప్పుడున్న రన్‌వేకు సమాంతరంగా ఎన్‌ 5 టాక్సీ ట్రాక్‌ నిర్మించారు. ఇవన్నీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన పనులు.


ఏ విధంగా సమంజసం?

భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చెందడానికి ఏకంగా 30ఏళ్లు విశాఖలో పౌర విమానాశ్రయానికి మూసేయాలని కోరడం ఏ విధంగా సమంజసమని విమాన ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఒక సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, మరొకటి మూసేయడం తగదని, రెండూ కొనసాగించాలని, ఎవరికి నచ్చింది వారు ఉపయోగించుకుంటారని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ఒత్తిడి తేవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో తాము నేరుగా మీడియాతో మాట్లాడితే...ఏదో వంక పెట్టి కేసులు పెడతారని, అందుకే మాట్లాడలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా అభిప్రాయం చెప్పే అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు ఆరోపించారు. 

Updated Date - 2020-11-20T06:04:29+05:30 IST