విజయవాడలో విశాఖ స్టీల్ బ్రాంచి మూసివేత.. అసలు కారణమదేనా..?

ABN , First Publish Date - 2020-09-22T17:42:33+05:30 IST

ఆంధ్రుల ఉక్కు సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రరాష్ట్ర నడిబొడ్డున నివసిస్తున్న వారికి అందకుండాపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నష్టాలకోర్చి బ్రాంచిలను నిర్వహిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం

విజయవాడలో విశాఖ స్టీల్ బ్రాంచి మూసివేత.. అసలు కారణమదేనా..?

ఉక్కు వెనక్కి.. విశాఖ స్టీల్‌ బ్రాంచి మూసివేత

రాజధానిపై నెలకొన్న నీలినీడలే కారణమా?

లాభాలు వస్తున్నా మూసివేత నిర్ణయం


విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల ఉక్కు సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రరాష్ట్ర నడిబొడ్డున నివసిస్తున్న వారికి అందకుండాపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నష్టాలకోర్చి బ్రాంచిలను నిర్వహిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం విజయవాడలో నిర్వహిస్తున్న తమ శాఖ లాభాలబాటలో ఉన్నా మూసేయాలని నిర్ణయించడం విస్మయానికి గురిచేస్తోంది. 


విజయవాడలోని భవానీపురంలో ఆసియాలోనే అతిపెద్ద స్టీల్‌ యార్డు ఉంది. ఇక్కడ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, టాటా స్టీల్‌ తదితర దిగ్గజ సంస్థలు రెండు దశాబ్దాలుగా స్టాక్‌ పాయింట్లను నిర్వహిస్తున్నాయి. స్టీల్‌ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న విజయవాడలో తమ శాఖను ఏర్పాటుచేస్తే ఈ ప్రాంత ప్రజలకు విశాఖ ఉక్కు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం 2016, ఫిబ్రవరి 26న ఇక్కడ బ్రాంచిని ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా విజయవాడ పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా 2017లో స్టాక్‌ పాయింట్‌నూ ఏర్పాటుచేశారు.


లాభాలు గడిస్తున్నా, మూసివేత

ఉన్నతాధికారుల అంచనాలను నిజం చేస్తూ విజయవాడ స్టాక్‌ పాయింట్‌ అద్భుతమైన టర్నోవర్‌ను సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.25 లక్షల టన్నుల విక్రయాలతో విజయవాడ స్టాక్‌ పాయింట్‌ దేశంలోనే అత్యధిక లాభాలు సాధించింది. స్థానికంగా స్టాక్‌ పాయింట్‌ అందుబాటులో ఉంటే రవాణా వ్యయం తగ్గడంతో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో విశాఖ స్టీల్‌ ఉత్పత్తులను అందించే వెసులుబాటు ఉంటుంది. విశాఖ స్టీల్‌ప్లాంటుకు దేశవ్యాప్తంగా 25 శాఖలుండగా, డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉన్న భువనేశ్వర్‌, ఆగ్రా, ఫరీదాబాద్‌ తదితర నగరాల్లో స్టాక్‌ పాయింట్లను నిర్వహిస్తున్న విశాఖ స్టీల్‌ యాజమాన్యం డిమాండ్‌ అధికంగా ఉన్న విజయవాడలోని స్టాక్‌ పాయింట్‌ను ఎత్తివేయాలని చూడటం విస్మయానికి గురిచేస్తోంది. స్టీల్‌ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌ అయిన విజయవాడలో బ్రాంచిని మూసివేసిన స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాహకులు స్టాక్‌ పాయింట్‌నూ మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలకు కాకుండా బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 


తరలింపు ఎందుకు..?

రాజధాని ఈ ప్రాంతంలో ఉండటం లేదన్న సాకుతో ఇక్కడ ఉన్న బ్రాంచిని, స్టాక్‌ పాయింట్‌ను స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం విజయవాడ నుంచి తరలించేందుకు సిద్ధమవుతోంది. రాజధాని విశాఖకు తరలిపోతున్నందున విజయవాడలో బ్రాంచి, స్టాక్‌ పాయింట్‌ అవసరం లేదనే వాదనను అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతం కావడంతో భవన నిర్మాణాల జోరు పెరగడంతో భారీగా ఐరన్‌ విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం భవన నిర్మాణాల జోరు తగ్గిపోయిన నేపథ్యంలో స్టాక్‌ పాయింట్‌, బ్రాంచిలను మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే, ఇక్కడ బ్రాంచి, స్టాక్‌పాయింట్‌ మూసివేతకు మరో కారణం కూడా ఉంది. విజయవాడలో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటుకాక ముందు ఇక్కడి ట్రేడర్లలో కొందరు వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని వినియోగదారులను, ఇబ్బందులకు గురిచేసేవారు. విశాఖ ఐరన్‌ను మంచి లాభాలకు విక్రయించుకునేవారు. స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటుతో వినియోగదారులు నేరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. దీంతో బడా వ్యాపారుల వ్యాపారంపై ప్రభావం పడింది. దీంతో స్టీల్‌ వ్యాపారంపై తమ గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు స్టాక్‌ పాయింట్‌ను మూసివేయించే దిశగా బడా వ్యాపారులు చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ఏదేమైనా సాధారణ గృహ నిర్మాణదారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న స్టాక్‌ పాయింట్‌ తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాన్ని స్థానికులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు ఈ దిశగా దృష్టి సారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2020-09-22T17:42:33+05:30 IST