Abn logo
Oct 28 2020 @ 14:15PM

విభిన్నం.. సిరిమాను సంబరం

కొద్ది మంది భక్తుల నడుమ ఊరేగింపు

టీవీలు... ప్రత్యేక స్ర్కీన్లపైనే వీక్షణ

నిర్దేశించిన సమయానికే కదిలిన సిరిమాను

పట్టువస్త్రాలు అందజేసిన మంత్రి బొత్స

ఉత్సవాలకు దూరంగా అశోక్‌ గజపతిరాజు


(విజయనగరం రూరల్‌): పైడితల్లి సిరిమానోత్సవం... ఈ పేరు చెబితే అశేష భక్త జనవాహిని కళ్ల ముందు కదలాడుతుంది. జనంతో కిటకిటలాడే విజయనగరం వీధులు గుర్తుకు వస్తాయి. పులివేషాలు.. సాంస్కృతిక కార్యక్రమాల సందడి... బంధువులతో కిటకిటలాడే లోగిళ్లు... మదిలో మెదులుతాయి. కరోనా నేపథ్యంలో ఉత్సవాల రూపురేఖలే మారిపోయాయి. బంధువుల సందడి లేదు. జనం రద్దీ లేదు. ఎక్కడికక్కడే ఆంక్షలు... అడుగడుగునా పోలీసులు... మూసుకుపోయిన జిల్లా సరిహద్దులు... బోసిపోయిన వీధులు... నిర్మానుష్యంగా మారిన రోడ్లు... పరిమిత సంఖ్యలో భక్తులు... ఇదీ ఏడాది అమ్మవారి ఉత్సవం తీరు. కొద్దిమంది ప్రజా ప్రతినిధులు... అధికారుల నడుమ సంప్రదాయ బద్ధంగా సిరిమానోత్సవాన్ని నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా సిరిమానోత్సవానికి భక్తులు రావద్దని వారం రోజులుగా అధికారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో భక్తులంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు తిలకించేందుకే పరిమితమయ్యారు.


పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ఈ ఏడాది వినూత్నంగా సాగింది. అశేష జన వాహిని లేకపోయినప్పటికీ భక్తిప్రపత్తులతో.. సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కరోనా నిబంధనలతో భక్తులంతా ఇళ్లలో నుంచి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఉత్సవ నిర్వాహకులు, అధికారులు, బందోబస్తు సిబ్బంది, కొద్దిమంది భక్తుల నడుమ జై పైడిమాంబ నామ స్మరణల నడుమ మంగళ వారం మధ్యాహ్నం 3.21 గంటలకు సిరిమాను కదిలింది. అమ్మవారి చదురుగుడి నుంచి సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఏడాది కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తుల సందడి తగ్గింది. సిరిమానుకు ముందు అమ్మవారి పరివారంగా చెప్పుకునే పాలధార, బెస్తవారి వల, అంజలి రథం, మాల ధారణ చేసిన భక్తులు నడిచారు. సిరి మానును అధిరో హించిన బంటుపల్లి వెంకట రమణ ఊరే గింపు ఆసాంతం అక్షింతలు వేస్తూ భక్తులను ఆశీర్వదించారు. సిరిమాను వెళ్తున్నప్పుడు ప్రజలు జై పైడిమాంబ అంటూ నినదిస్తూ.. అరటి పండ్లను విసురుతూ.. భక్తిప్రపత్తులను చాటు కున్నారు. దాదాపు రెండు గంటల పాటు సిరిమాను మూడు పర్యాయాలు కోట శక్తికి నమస్కరించి తిరిగి వచ్చింది. నడిచే దేవతగా పేరొందిన పైడి మాంబ సిరిమానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో  జిల్లా అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. దీంతో భక్తులు తక్కువగా కనిపించారు. ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింద నే చెప్పాలి. మాన్సాస్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కోట బురుజుపై ఆశీనులు కావాల్సిన పూసపాటి వంశీయులు అశోక్‌ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, అదితి గజపతిరాజు ఉత్సవానికి రాలేదు. ఆ నందగజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతి రాజు కోట బురుజుపై కూర్చున్నప్పటికీ సిరి మాను మొదటి పర్యాయం తిరిగిన అనంత రం నిష్క్రమించారు. కోట బురుజుపై మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ హోదాలో సంచయిత గజపతి రాజు ఆశీనులయ్యారు. మాన్సాస్‌ సిబ్బంది, కొద్ది మంది దేవదాయ శాఖాధికారులు ఆమె వెంట ఉన్నారు.  డీసీసీబీ కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు తిలకించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజారి బంటుపల్లి వెంకటరమణ హుకుం పేట నుంచి ఉల్లివీధి, కన్యకా పరమేశ్వరీ ఆలయం, గంట స్తంభం మీదుగా మూడు లాంతర్ల వద్దనున్న చదురుగుడికి చేరుకున్నారు. సిరిమాను రథం  హుకుంపేట నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మవారి పరివారంగా భావించే అంజలి రథం, బెస్తవారి వల, పాలధార వంటివి కూడా నిర్దేశించిన సమయానికే చదురుగుడికి చేరుకోవడంతో సాయంత్రం 5 గ ంటలకు సిరిమానోత్సవం ముగిసింది.


మంత్రి బొత్స సత్యనారాయణ సతీసమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, పైడిమాంబ దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేకాధికారి మూర్తి, దేవదాయశాఖ ఏసీ రంగారావు, పైడిమాంబ ఆలయ ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం తదితరులు  ఉన్నారు.


పైడిమాంబను చదురుగుడిలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకున్న వారిలో ఉన్నారు.


ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజులు పైడిమాంబ ఆలయం లో ప్రత్యేక పూజ లు చేశారు. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో వీరు దర్శనానికి వచ్చారు. అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల తో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసి ప్రసాదాన్ని అందించారు.


కరోనా నిబంధనల నేపథ్యంలో సిరిమానోత్సవ వీక్షణకు భక్తులను జిల్లా అధికార యంత్రాంగం అనుమతించలేదు. నగరంలోని 17 ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌, ఆర్‌అండ్‌బీ, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కోట, అంబేడ్కర్‌ కూడలి, హుకుంపేట, తెలకలవీధి, కొత్తపేట జంక్షన్‌, పూల్‌బాగ్‌ కాలనీ, కాటవీధి పార్కు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ద్వారా భక్తులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు.

Advertisement
Advertisement
Advertisement