బైడెన్ గెలుపుపై ఎట్టకేలకు మనసులో మాటను బయటపెట్టిన పుతిన్!

ABN , First Publish Date - 2020-11-23T02:44:59+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపె

బైడెన్ గెలుపుపై ఎట్టకేలకు మనసులో మాటను బయటపెట్టిన పుతిన్!

రష్యా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపెట్టారు. అగ్రరాజ్య అధినేతగా జో బైడెన్‌ను గుర్తించడానికి సిద్ధంగా లేనంటూ కుండ బద్ధలు కొట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉత్కంఠగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. 306 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకుని అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రపంచ దేశాధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. బైడెన్ విజయాన్ని చైనా కాస్త ఆలస్యంగా అయినా గుర్తించి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. అయితే రష్యా మాత్రం ఇప్పటి వరకు బైడెన్‌ను విష్ చేయలేదు.



ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. బైడెన్ గెలుపుపై తన మనసులోని మాటను బయటపెట్టారు. అమెరికా అధ్యక్షడిగా జో బైడెన్ విజయాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేనంటూ ప్రకటించారు. ‘అమెరికా ప్రజల నమ్మకం కలిగిన ఏ నాయకుడితోనైనా పని చేయడానికి మేము సిద్ధం. కానీ ఆ విశ్వాసాన్ని ప్రత్యర్థి పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టబద్ధమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాత మాత్రమే పొందుతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రష్యా-అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే నాశనమయ్యాయని.. కొత్తగా దెబ్బతినడానికి ఏమీ మిగిలి లేదంటూ బదులిచ్చారు. ఇదిలా ఉంటే.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు రష్యా కృషి చేసిందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-11-23T02:44:59+05:30 IST