వీఎంఆర్‌డీఏ అంకెల గారడీ

ABN , First Publish Date - 2021-04-14T06:23:55+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీ) నేల విడిచి సాము చేస్తోంది.

వీఎంఆర్‌డీఏ అంకెల గారడీ

ఆదాయం రూ.120 కోట్లు...బడ్జెట్‌ రూ.2 వేల కోట్లు

నిధులు లేకున్నా...బారెడు పద్దులు 

ఆదాయం కంటే...పది రెట్ల వ్యయం

రూపాయి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

ఖాళీ అయిపోతున్న ఖజానా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీ) నేల విడిచి సాము చేస్తోంది. అధికార పార్టీ పెద్దల మాటలు కాదనలేక వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం నెత్తిన వేసుకుంటోంది. రూపాయి రూపాయ చొప్పున దశాబ్దాలుగా కూడబెట్టిన మొత్తం హారతి కర్పూరంలా కరిగించేస్తోంది. చివరకు ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో ఇవ్వాల్సిన మొత్తాలకు కూడా నిధులు లేని స్థితికి చేరుతోంది. కొత్త సంవత్సరం వచ్చింది. బడ్జెట్‌ రూపొందించుకోవాలి. దీనిపై నెల రోజులుగా విభాగం సిబ్బంది, ఉన్నతాధికారులు కుస్తీ పడుతున్నారు. గత ఏడాది 2020-21లో 1,707.13 కోట్లకు బడ్జెట్‌ రూపొందించగా, ఈ ఏడాది రూ.2 వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆదాయం బెత్తెడు...ఆశలు బారెడు అన్నట్టుగా ఉంది వీఎంఆర్‌డీఏ పరిస్థితి.


వచ్చేది రూ.120 కోట్లు 


వీఎంఆర్‌డీఏకి ఏటా వచ్చే ఆదాయం రూ.110 కోట్ల నుంచి రూ.120 కోట్లు మాత్రమే. వాణిజ్య సముదాయాల ద్వారా రూ.20 కోట్లు, లేఅవుట్ల ఫీజుల ద్వారా రూ.15 కోట్లు, పార్కులు, మ్యూజియాల్లో ప్రవేశ రుసుముల ద్వారా రూ.10 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల ద్వారా రూ.10 కోట్లు, లైన్‌ డిపార్ట్‌మెంట్ల ద్వారా రూ.20 కోట్లు, ఇతర మార్గాల్లో మరో రూ.40 కోట్ల వరకు వస్తాయి. అంతకు మించి వచ్చే అవకాశం లేదు. గత డిసెంబరులో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం పెట్టినందున దాని ద్వారా ఇంకో రూ.30 కోట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా కారణంగా గత ఏడాది పార్కులు మూసేయడం వల్ల, ఇతర రంగాల్లో వ్యవహారాలు నెమ్మదించడం వల్ల ఆదాయం 20 శాతం వరకు తగ్గింది. 


గత ఏడాది బడ్జెట్‌ లెక్కలు


ఏడాదిన్నర క్రితం (డిసెంబరు, 2019) సీఎం జగన్‌ చేతుల మీదుగా రూ.380 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటినే 2020-21 బడ్జెట్‌లో చూపించారు. వాటిలో కొన్నింటికి ఇప్పటికీ పునాదిరాయి పడలేదు. కాపులుప్పాడలో 15 ఎకరాల్లో హిస్టరీ మ్యూజియం, పార్కు నిర్మాణానికి రూ.88 కోట్ల వ్యయం చూపించారు. నాలుగు రాళ్లు తెచ్చి పెట్టారే తప్ప అక్కడ ఇంకేమీ లేదు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో ప్లానిటోరియం ప్రకటించారు. ఇది ప్రచారమే తప్ప పనులు లేవు. సిరిపురం జంక్షన్‌లో రూ.80 కోట్లతో మల్టీలెవెల్‌ కారు పార్కింగ్‌ అన్నారు. దానికి ఇప్పటికీ టెండర్లు ఖరారు కాలేదు. బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ను రూ.40 కోట్లతో నిర్మిస్తామన్నారు. అందులో రూ.10 కోట్లతో సీ హ్యారియర్‌ ప్రాజెక్టు కూడా ఉంది. అది మార్చి నాటికి పూర్తి కావలసి ఉంది. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. కైలాసగిరిని అభివృద్ధి చేయడానికి రూ.57 కోట్ల బడ్జెట్‌ చూపించారు. ఈ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. అచ్యుతాపురంలో ఏపీ ఎస్‌ఈజెడ్‌ వరకు రూ.27 కోట్లతో రహదారిని ప్రతిపాదించారు. అచ్యుతాపురం జంక్షన్‌ అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించారు. ఇలా చాలా పనులే ప్రకటించారు. ఇందులో పూర్తయింది కేవలం రెండు, మూడు మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు మాత్రమే. మిగిలినవన్నీ అలానే ఉన్నాయి. వాటినే ఘనంగా ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో చూపించమన్నారు. 


తలకెత్తుకున్న అనవసర వ్యయాలు


- రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి, జిల్లాలో అనేకచోట్ల ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూములు సమీకరించింది. వాటిలో లేఅవుట్లు వేసే బాధ్యత వీఎంఆర్‌డీఏపై పెట్టింది. రూపాయి కూడా ఇవ్వలేదు. తుప్పలు కొట్టించి, గుట్టలు చదును చేసి, చెరువులు కప్పించి, లేఅవుట్లు వేసి, కాలువలు తవ్వి, రహదారులు నిర్మించడానికి వీఎంఆర్‌డీఏ రూ.80 కోట్ల వరకు వెచ్చింది. ఇప్పటివరకు రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 


- రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో కొండపై 30 ఎకరాల్లో అతి పెద్ద అతిథిగృహం నిర్మాణానికి నడుం కట్టింది. అదంతా కొండ. దానిని చదును చేసి, నిర్మాణాలు చేపట్టాలి. ఈ బాధ్యత కూడా వీఎంఆర్‌డీఏపైనే పెట్టింది. దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో చెప్పడం లేదు గానీ కోర్టు స్టే వున్నా పనులు గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇప్పటిరకు రూ.10 కోట్ల వరకు వ్యయం అయి వుంటుందని అంచనా. 

- తాజాగా ప్రభుత్వం మధ్య తరగతికి ఇళ్ల స్థలాలు మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఇస్తామని ప్రకటించింది. అందులో వీఎంఆర్‌డీఏను కూడా భాగస్వామిని చేసింది. భూములు కొనుగోలు చేసి, లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముతారని అంటున్నారు. అంటే...వాటికి అయ్యే వ్యయం కూడా వీఎంఆర్‌డీఏనే ప్రాథమికంగా సమకూర్చుకోవాలి.


డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?


వీఎంఆర్‌డీఏకి ముందు చెప్పుకున్నట్టుగా ఏడాదికి రూ.120 కోట్లకు మించి ఆదాయం రాదు. గత రెండేళ్లుగా భూముల వేలం గానీ, కొత్త లేఅవుట్ల గానీ వేయలేదు. దాంతో అదనపు ఆదాయం శూన్యం. ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నిధులు తీసి ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి సీఎంగా వున్నప్పుడు బడ్జెట్‌ సపోర్టు పేరుతో నాటి వుడా విశాఖలో భూములు వేలం వేసి ప్రభుత్వానికి రూ.వేయి కోట్లు చెల్లించింది. ఆ ఆదాయంపై పన్ను కట్టాలని వుడా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ.250 కోట్ల వరకు వసూలు చేసింది. వాస్తవానికి అది రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. కానీ వుడా కట్టింది. ఈ క్రమంలో బ్యాంకులో వుడా డిపాజిట్లను కూడా ఐటీ విభాగం సీజ్‌ చేసింది. ఇటీవలె ఈ కేసులో అనుకూలంగా తీర్పు రావడంతో రూ.190 కోట్ల వరకు నిధులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనులకు ఖర్చు చేయడానికి అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. దశాబ్దకాలంగా వీఎంఆర్‌డీఏ అందించిన సేవలు, పెట్టిన వ్యయాలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఎంఆర్‌డీఏకి రూ.500 కోట్లకు పైగా రావలసి ఉంది. అవి ఇవ్వడం లేదు సరికదా, ఇంకా ప్రాజెక్టుల భారం సంస్థపై పెడుతోంది. ఏడాదికి రూ.120 కోట్ల ఆదాయం వచ్చే సంస్థ రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నందంటే...తిమ్మిని బమ్మి చేయడం కాకపోతే.. మరేమిటి? అని నగర ప్రజలు విస్తుపోతున్నారు. 

Updated Date - 2021-04-14T06:23:55+05:30 IST