వొడాఫోన్‌ ఐడియా నష్టం

ABN , First Publish Date - 2020-07-02T06:10:13+05:30 IST

దేశంలో మూడో పెద్ద టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా మార్చి 31వ తేదీతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.73,878.10 కోట్ల

వొడాఫోన్‌ ఐడియా నష్టం

రూ.73,878 కోట్లు


న్యూఢిల్లీ : దేశంలో మూడో పెద్ద టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా మార్చి 31వ తేదీతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.73,878.10 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. భారత కార్పొరేట్‌ చరిత్రలో ఒక దేశీయ సంస్థ నమోదు చేసిన అతి పెద్ద నష్టం ఇదే. అంతకు ముందు ఏడాది నష్టం రూ.14,603.90 కోట్లు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిల్లో టెలికాం ఇతర ఆదాయాలను కూడా జత చేయాల్సి రావడం, దానికి తగినన్ని నిధులు కేటాయించాల్సి రావడం  లాభాలను కుంగదీసినట్టు కంపెనీ తెలిపింది. ఈ విధానంలో కంపెనీపై రూ.51,400 కోట్ల బకాయిల చెల్లింపు భారం పడింది. ఈ భారంతో ఎంతవరకు పని చేయగలం అనేది కూడా అనుమానాస్పదంగా మారిందని నియంత్రణ సంస్థలకు పంపిన ప్రకటనలో కంపెనీ తెలియచేసింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.11,643.50 కోట్లని తెలిపింది. కాగా త్రైమాసికాదాయం రూ.11,754.20 కోట్లు, సంవత్సరాదాయం రూ.44,957.50 కోట్లు. అయితే వొడాఫోన్‌ ఐడియా విలీనం ప్రక్రియ కారణంగా కంపెనీ ఆర్థిక ఫలితాలను అంతకు ముందు ఏడాది ఫలితాలతో పోల్చకూడదని కంపెనీ తెలిపింది. గత  ఏడాది క్యు4 నష్టం రూ.4881.90 కోట్లు. దశలవారీగా స్పెక్ట్రమ్‌కు చెల్లించాల్సిన బకాయి రూ.87,650 కోట్లు కూడా జత చేస్తే మార్చి 31వ తేదీ నాటికి కంపెనీపై రూ.1.15 లక్షల కోట్ల రుణభారం ఉంది. మార్చి చివరి నాటికి కంపెనీ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 30.4 కోట్లు. ప్రీపెయిడ్‌ చార్జీలు పెంచడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఆర్పు) క్యు4లో రూ.121కి పెరిగింది. మూడో త్రైమాసికంలో ఇది రూ.109. ఇదిలా ఉండగా 2016-17 సంవత్సరానికి వొడాఫోన్‌ ఐడియా సద్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిలు రూ.58,254 కోట్లని టెలికాం శాఖ అంచనా వేసింది. అయితే తమ బకాయి మొత్తం రూ.46 వేల కోట్లు మాత్రమేనని, గతంలో చేసిన చెల్లింపులు, మదింపులో దిద్దుబాట్లు డాట్‌ పరిగణనలోకి తీసుకోలేదని కంపెనీ చెబుతోంది. కాగా కంపెనీ ఇప్పటి వరకు రూ.6,854.40 కోట్ల బకాయిలు చెల్లించింది. 


తాము ఇప్పటివరకు 92 శాతం నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌ పూర్తి చేయగలిగామని, లాక్‌డౌన్‌ కారణంగా దానికి అంతరాయం ఏర్పడిందని, మిగతా పనులు పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టవచ్చునని కంపెనీ తెలిపింది. అయితే త్వరితగతిన నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌ పూర్తి చేయడం, 4జీ కవరేజి, సామర్థ్యాల విస్తరణ కారణంగా కస్టమర్‌ అనుభవం మరింతగా మెరుగుపడిందని, పలు రాష్ర్టాలు, మెట్రోలు, పెద్ద నగరాల్లో 4జీ డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో తామే ముందున్నామని కంపెనీ సీఈఓ రవీందర్‌ టక్కర్‌ అన్నారు. ఏజీఆర్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల మూడో వారంలో ఉన్నట్టు ఆయన చెప్పారు. 

Updated Date - 2020-07-02T06:10:13+05:30 IST