స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-06T05:36:27+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పలు మండల కేంద్రాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌కు శ్రీకారం చుడుతున్నారు.

స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌
లాక్‌డౌన్‌ విధించడంతో బుధవారం సాయంత్రం రాజోలిలో మూతపడిన దుకాణాలు

- వ్యాపారాల సమయం కుదింపు

రాజోలి/గద్వాల క్రైం/అలంపూర్‌/ఇటిక్యాల/అయిజ, మే 5 : జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పలు మండల కేంద్రాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌కు శ్రీకారం చుడుతున్నారు. రాజోలి మండల కేంద్రంలో ప్రతీ రోజు సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ విధించినట్లు సర్పంచ్‌ వెంకటేశ్వరమ్మ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమా వేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

- గట్టు మండల కేంద్రంలో సర్పంచి ధనలక్ష్మీ, ఎస్‌ఐతో పాటు, వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి రోజు 4 గంటల నుంచి దుకాణాలు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

- రాజోలిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను అతిక్రమించి, తుంగభద్రా నది నుంచి ఎద్దుల బళ్లలో ఇసుక తరలిస్తున్న వారిని ట్రైనీ ఎస్సై శ్రీనివాసులు అడ్డుకొని హెచ్చరించారు. అనంతరం ఇసుకను రాజోలి బస్టాండులో ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయం ముందు అన్‌లోడ్‌ చేయించి పంపించారు. 

- గద్వాల పట్టణంలో సాయంత్రం ఐదు గంటల వరకే కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కిరాణం దుకాణాల సంఘం అధ్యక్షుడు చల్లా శ్రీధర్‌ తెలిపారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించుకున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. 


నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అలంపూర్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి హెచ్చ రించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలంపూర్‌ మండలంలోని క్యాతూరులో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. కొవిద్‌ కట్టడికి అధికారులతో సహకరించాలని కోరారు. అన్ని గ్రామాల్లో రాత్రి ఎనిమిది గంటలకు వ్యాపార, వాణిజ్య సముదా యాలను మూసివేవాలన్నారు. రాత్రి 9గంటల తర్వాత ఎవ్వరూ బయట తిరగదన్నారు.


మాస్కు  లేకుంటే జరిమానా తప్పదు

నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానా తప్ప దని ఇటిక్యాల ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బుధవారం ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం పోలీసులు గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా జనం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా జరిమానా విధించినట్లు చెప్పారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, ద్విచక్రవాహనాలపై ఇద్దరు ఉండాలని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికు లను ఎక్కించుకోవద్దని సూచించారు. రాత్రి కర్ఫ్యూకు అందరూ సహకరించాలని కోరారు. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కరోనాపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని రాజోలి ఎస్‌ఐ శ్రీనివాస్‌ అన్నారు. రాజోలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. కొన్ని రోజుల పాటు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందురావు, రెవెన్యూ డీటీ వెంకటరమణ, వైద్య సిబ్బంది జయప్రకాష్‌, సర్పంచు వెంకటేశ్వరమ్మ, ఉపసర్పంచు గోపాల్‌ పాల్గొన్నారు. 


సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి

అయిజ పట్టణంలోని వీధుల్లో బుధవారం సాయంత్రం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2021-05-06T05:36:27+05:30 IST