వలంటీర్‌ వ్యవస్థ చంపేసింది!

ABN , First Publish Date - 2021-11-04T14:11:51+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ నివాస ప్రాంతం తాడేపల్లిలో..

వలంటీర్‌ వ్యవస్థ చంపేసింది!

పని ఒత్తిడి తాళలేక వలంటీరు బలి

కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య

ఎంత పని చేసినా వేధిస్తున్నారు

రాజీనామా చేసి పొమ్మంటున్నారు

సూసైడ్‌ నోట్‌లో బాధితుడి వేదన


తాడేపల్లి టౌన్‌: ముఖ్యమంత్రి జగన్‌ నివాస ప్రాంతం తాడేపల్లిలో ఓ వార్డు వలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వలంటీర్‌ వ్యవస్థే కారమణమని, పని ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌ రాసి కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. రెండురోజుల క్రితం ఈ విషాదం చోటుచేసుకోగా.. బుధవారం అతని మృతదేహం బయటపడింది. కే రవికుమార్‌(21) తాడేపల్లి 15వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల సచివాలయ సిబ్బంది అప్పగించిన ఇంటి సర్వేని సకాలంలో పూర్తి చేయలేకపోయారు.


దీంతో సరిగ్గా పనిచేయడం లేదంటూ రవిని సచివాలయ సిబ్బంది మందలించా రు. దానికితోడు పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రవికుమార్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సూసైడ్‌ నోట్‌ రాసి.. అది తడవకుండా ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి జేబులో పెట్టుకున్నారు. సరాసరి కృష్ణానది వద్దకు వెళ్లి దూకేశాడు. రవికుమార్‌ కనపడడం లేదని తాడేపల్లి పోలీసులకు అతడి కుటుంబసభ్యులు రెండురోజుల క్రితం ఫిర్యాదు చేశారు. మహానాడు పరిధి పిరమిడ్‌ కేంద్రం సమీపంలో రవికుమార్‌ మృతదేహం బుధవారం లభ్యమైంది. ‘‘ఎంత పనిచేసినా సచివాలయ అడ్మిన్‌ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయమంటున్నారు. వద్దు అని నా తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వలంటీర్‌గా చేరాను. వలంటీర్‌ వ్యవస్థే నా చావుకు కారణం’’ అని ఆ సూసైడ్‌ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-04T14:11:51+05:30 IST