వలంటీర్ల పోస్టుల కుదింపు

ABN , First Publish Date - 2020-07-18T11:27:17+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వలంటీరు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు.

వలంటీర్ల పోస్టుల కుదింపు

ప్రభుత్వ మార్గదర్శకాలతో తగ్గుతున్న పోస్టులు

పట్టణ, వార్డు వలంటీర్లకు పెరగనున్న బాధ్యతలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వలంటీరు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నియమితులైన వార్డు వలంటీర్ల పనితీరును అంచనావేయడంతోపాటు వారికి కేటాయించిన కుటుంబాల ఆధారంగా పరిస్థితులను అధ్యయనంచేసి అవసరానికి మించి ఉన్న వలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో 50 కుటుంబాలకు లోపు ఉన్న వలంటీర్ల విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలకు అధికార వైసీపీకి చెందిన నేతలే తీవ్రస్థాయిలో అడ్డు తగులు తున్నారు. ఈ విఽధానం అమలు ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో వందల సంఖ్యలోనే వలంటీర్ల పోస్టులు గాలిలో కలిసి పోనున్నాయి. ఈనెల 6వ తేదిన గ్రామ వలంటీర్లు, వార్డు వలం టీర్లు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌, వార్డు సెక్రటేరియట్స్‌ విభాగానికి చెందిన కమిషనర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ ఎంపీడీవోలకు, కమిషనర్లకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు.


దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు వలంటీర్లకు 51 కుటుంబాలకు పైగా, పట్టణ వార్డుల్లో విధులు నిర్వహించే 100కు పైగా కుటుంబాలకు సేవలు అందిస్తున్న వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఆ నిబంధనలకు లోబడి తక్కువ సంఖ్య లో కుటుంబాలు కేటాయించబడ్డ వలంటీర్లను తొలగించేలా మార్గదర్శకాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 75 కుటుంబాల కంటే ఎక్కువ ఉంటే రెండో క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని సూచిం చారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు తీవ్రస్థాయిలో చేస్తున్న కసరత్తులకు అధికార పార్టీ నాయ కుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. తమ ప్రాంతాల్లో వలంటీర్లను తగ్గించడం కుదరదంటూ వైసీపీ నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నారు. ఉదాహరణకు వివిధ మండలాల్లో ఈ ప్రక్రియలో భాగంగా ఎక్కువ మందినే వలంటీర్లను తొలగించాల్సి ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో సర్దుబాట్లుచేసి పోస్టులు కొనసాగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఉదాహరణకు ఉప్పలగుప్తం మండలంలో ముగ్గురు వలంటీర్లను విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని 22 గ్రామాల్లో ప్రస్తుతం 493 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. సర్దుబాట్లు పోగా అతికష్టంపై నలుగురిని విధుల నుంచి తప్పించే విధంగా రంగం సిద్ధమైంది. చిందాడగరువులో ఇద్దరు, రోళ్లపాలెం గ్రామంలో ఇద్దరిని ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్‌లో ఉంచినట్టు సమాచారం. అదేవిధంగా అమలాపురం మున్సిపాలిటీలో పదహారు మంది వరకు వలంటీర్లను తొలగించాల్సి ఉనన్నప్పటికీ రాజకీయపరమైన ఒత్తిళ్లతో ఎంతమందిని తగ్గిస్తారనేది తేలాల్సి ఉంది.


మండలాల స్థాయిలో 250 మంది, పట్టణాల్లో మరో 250 మందికి పైగా మొత్తం 500 మంది వరకు వలంటీర్లు విధులకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కొంతమంది వలంటీర్ల పనితీరులో వచ్చిన ఆరోపణలు, ఇతరత్రా వివాదాలు వంటి కారణాలతో చాలా  పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పనితీరు సక్రమంగాలేని వ్యక్తులను ఈ కారణాలతో తొలగించేందుకు అధికారులు చర్యలు తీసు కుంటున్నట్టు సమాచారం. ఆయా వార్డు వలంటీర్లు విధిగా పంచాయతీ సెక్రటరీ వద్ద ప్రతిరోజు హాజరు వేయించుకునే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశారు. క్లస్టర్ల వలంటీర్లను విభజించిన నివేదికలను ప్రభు త్వానికి పంపించాల్సిందిగా కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఆదేశించారు.

Updated Date - 2020-07-18T11:27:17+05:30 IST