వలంటీర్ల అరాచకాలు

ABN , First Publish Date - 2020-04-05T15:09:58+05:30 IST

గుంటూరు నగరంలో వలంటీర్ల అరాచకాలు..

వలంటీర్ల అరాచకాలు

రేషన్‌ డీలర్‌, జనసేన అభ్యర్థిపై దాడులు

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో వలంటీర్ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శనివారం రేషన్‌ డీలర్‌, జనసేన కార్పొరేటర్‌ అభ్యర్థిపై దాడులు జరిగాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్రాడీపేట 2/19లోని 33వ రేషన్‌ డీలర్‌ వద్ద శనివారం ఉదయం రేషన్‌ పంపిణీ సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. కోబాల్డ్‌పేట, తదితర ప్రాంతాలకు చెందిన కార్డుదారులను పిలిపించి వారికి రేషన్‌ ఇవ్వాలని 122వ సచివాలయం అడ్మిన్‌ చౌడయ్య, వలంటీర్‌ అజయ్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. అప్పటికే క్యూలో ఉన్నవారికి, వేరే ప్రాంతానికి వచ్చిన వారి మధ్య వివాదం మొదలైంది. దీంతో రేషన్‌ డీలర్‌ కృష్ణంరాజు పట్టాభిపురం పోలీసులకు ఫోన్‌చేయడంతో వలంటీర్‌ అజయ్‌, అడ్మిన్‌ చౌడయ్యలు కుర్చీతో దాడిచేసి తలపగలగొట్టారు. కృష్ణంరాజును జీజీహెచ్‌కు తరలించారు. 


జనసేన అభ్యర్థిపై వలంటీర్‌ దాడి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రూ.వెయ్యి సరిగా ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు జనసేన అభ్యర్థి సువర్ణబాబుపై వలంటీర్‌ దాడికి పాల్పడ్డాడు. సంజీవయ్యనగర్‌ 1వ లైనులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సువర్ణబాబు 55వ డివిజన్‌కు జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలుచేశారు. వృద్దులు, దివ్యాంగులకు పెన్షన్‌ ఇవ్వకుండా వారి పేర్లను తొలగిస్తున్నాడని, అలాగే శనివారం నుంచి పేదలకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి సరిగా ఇవ్వడం లేదని వార్డు వలంటీర్‌ దేవను సువర్ణబాబు నిలదీశారు. దీంతో దేవ తన ఇంటి ముందే ఆయనపై తన సోదరుడు అనిల్‌, మరికొంత మంది అనుచరులతో దాడి చేశారు. ఈ మేరకు అరండల్‌పేట స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. 

Updated Date - 2020-04-05T15:09:58+05:30 IST