ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లు దూరం

ABN , First Publish Date - 2021-04-16T07:41:30+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచినట్టు కలెక్టర్‌ హరినారాయణన్‌ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.

ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లు దూరం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

సీఈసీ ఆదేశాల మేరకు నిర్ణయమన్న కలెక్టర్‌

స్వేచ్ఛగా ఓట్లేయవచ్చన్న డీఐజీ 


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 15: తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచినట్టు కలెక్టర్‌ హరినారాయణన్‌ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఉప ఎన్నికల ఏర్పాట్లపై తిరుపతి ఆర్డీవో కార్యాయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు సంబంధించి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 7.4 లక్షల ఓటర్లు ఓట్లేసేందుకు 1056 పోలింగ్‌ స్టేషన్లలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆయా పోలింగ్‌ స్టేషన్లకు సరంజామా, మెటీరియల్‌ను శుక్రవారం పంపిస్తామన్నారు. గురువారం సాయంత్రం 7 గంటల తర్వాత నుంచి ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్‌ పూర్తయ్యే 48 గంటల ముందు నుంచి స్థానికులు, భక్తులు కాకుండా ఇతర ప్రాంతాల వారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 


విద్రోహుల సమాచారం ఇవ్వండి

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓట్లేయాలని అనంతపురం రేంజి డీఐజీ క్రాంతిరాణాటాటా సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేవారు, విద్రోహుల సమాచారాన్ని డయల్‌ 100, 63099 13960 నెంబర్లకు ఫోనుచేసి సమాచారమివ్వాలన్నారు. 80999 99977 నంబరుకు కాల్‌తోపాటు వాట్సాప్‌ సదుపాయం ఉందన్నారు. 


2913 మందితో బందోబస్తు

తిరుపతి ఉప ఎన్నికకు పదిమంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, 66 మంది సీఐలు, 169 మంది ఎస్‌ఐలు, 697 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1519 మంది పీసీలు, 234 మంది ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది, 191 మంది హోంగార్డులు, 716 మంది సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు, సిబ్బందితో కలిపి 2913 మందితో బందోబస్తు  ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. రూట్‌ మొబైల్స్‌ 105, క్యూఆర్‌ టీమ్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 27, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 13, ఎస్‌.ఎ్‌స.టి. టీమ్స్‌ 8, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ 8, ఎంసీసీ బృందాలు 8, ఇంటర్వెన్షన్‌, మహిళా ఇంటర్వెన్షన్‌ టీమ్స్‌ 19 ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినా.. అల్లర్లకు పాల్పడ్డా, ప్రేరేపించినా, అబద్ద ప్రచారాలు చేసినా, నగదు, మద్యం, బహుమతులు పంపిణీచేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్‌ బూత్‌లు, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేశామన్నారు. 

Updated Date - 2021-04-16T07:41:30+05:30 IST