43.11లక్షలు

ABN , First Publish Date - 2021-01-16T06:56:21+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటి కంటే జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది.

43.11లక్షలు

జిల్లా ఓటర్లు

ప్రత్యేక సవరణ జాబితా ప్రకటన

గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే 41,189 పెరుగుదల

2,416 మంది పేర్ల తొలగింపు

బహదూర్‌పురాలో ఇతరులు అధికం

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో జాబితా

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా

తనిఖీ చేసుకుని ఫిర్యాదులు నమోదు చేయొచ్చు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటి కంటే జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌ 16, 2020న ప్రకటించిన జాబితాలో 42.70 లక్షల ఓటర్లు ఉండగా, నెలన్నర రోజుల్లో 41 వేల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా-2021ను శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 43.11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో నిర్ణీత తేదీ అనంతరం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచామని, వారి పేర్లు సవరణ జాబితాలో చేరాయని ఓ అధికారి తెలిపారు. సంస్థలోని ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ జాబితా రూపొందించినట్టు పేర్కొన్నారు. ఠీఠీఠీ.ఛ్ఛి్ట్ఛౌజ్చూుఽజ్చుఽ్చ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌లోనూ జాబితా అందుబాటులో ఉంచారు. జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ కోరారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు.  నియోజకవర్గాల వారీగా ఉండే ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ ఆఫీసర్లు, సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి చెందిన బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల వద్ద జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. ఓటర్లుగా పేరు నమోదు నిరంతర ప్ర క్రియ అని, అర్హత ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 

అత్యల్పంగా చార్మినార్‌, సనత్‌నగర్‌

జిల్లాలో 43.11 లక్షల ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 22.30 లక్షల మంది, మహిళలు 20.81 లక్షలు, ఇతరులు 222 మంది ఉన్నారు. బహదూర్‌పురా నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇతరులు 51 మంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఇతరుల కేటగిరీ ఓటర్లలో ఇది 23 శాతం కావడం గమనార్హం. జిల్లాలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 3.68 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 3.3.9 లక్షలతో యాకుత్‌పురా, 3.31 లక్షలతో కార్వాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 2.15 లక్షల ఓటర్లు, సనత్‌నగర్‌లో 2.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 

అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో.. 

నవంబర్‌లో ప్రకటించిన జాబితాలో ఉన్న 2,416 మంది పేర్లను తొలగించారు. అధికంగా గోషామహల్‌లో 302, బహదూర్‌పురాలో 230, అత్యల్పంగా చాంద్రాయణగుట్టలో 81, ఖైరతాబాద్‌లో 107 మంది పేర్లు సవరించిన జాబితాలో లేవు. మరణించడం, చిరునామా మారడం, ఇతర ప్రాంతాల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం వంటి కారణాలతో వారి పేర్లు తీసేశామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 4,664, చాంద్రాయణగుట్టలో 3,858, అత్యల్పంగా కంటోన్మెంట్‌లో 673, సనత్‌నగర్‌లో 1,669 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 

Updated Date - 2021-01-16T06:56:21+05:30 IST