ఓట్ల కోసం వలంటీర్లు

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సచివాలయాలను, వాటికి అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో గ్రామ వలంటీర్ల నియామకమే వివాదాస్పదంగా జరిగింది. నెలకు రూ. 5వేల పారితోషికంతో ఈ నియామకాలు జరిపిన ప్రభుత్వం అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యతనిచ్చి వలంటీర్లను ఎంపిక చేసింది.

ఓట్ల కోసం వలంటీర్లు

పురుపోరులో లబ్ధి కోసం 

అధికార పార్టీ నేతల వ్యూహం

వలంటీర్లపై ఒత్తిళ్లు.. ప్రలోభాలు

వారి సూచనతో ఓటు వేయకుంటే 

పథకాలు కట్‌ చేస్తామని హెచ్చరికలు

వైసీపీ నేతల చేతిలో 

గృహాల వారీ సమాచారం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

నిన్న సం‘గ్రామం’.. నేడు పురపోరు. ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో వలంటీర్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా, ప్రస్తుత మున్సిపోల్స్‌లో వారి వ్యవహార శైలిపై ఆరోపణలు తారస్థాయికి చేరాయి. ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉందంటే పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్ది వలంటీర్ల పాత్ర రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం లేకపోలేదు.  అధికార పార్టీ నాయకులు వీరి నుంచి ఇంటింటి సమాచారం తీసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థికి మద్దతుగా పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వారిని లోబర్చుకునేందుకు ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు.  పనిలో పనిగా పొదుపు సంఘాల లీడర్ల ద్వారా కూడా లబ్ధిపొందే ప్రయత్నాలకు వైసీపీ నేతలు శ్రీకారం పలికారు. 


 రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సచివాలయాలను, వాటికి అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందులో గ్రామ వలంటీర్ల నియామకమే వివాదాస్పదంగా జరిగింది. నెలకు రూ. 5వేల పారితోషికంతో ఈ నియామకాలు జరిపిన ప్రభుత్వం అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యతనిచ్చి వలంటీర్లను ఎంపిక చేసింది. తదనంతరం వారిని పర్యవేక్షించే మండల పరిషత్‌ అధికారులు కూడా అధికారపార్టీ ప్రజాప్రతినిధుల, నేతల కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో వివిధ కారణాలతో తమకు నచ్చని వలంటీర్లను తొలగించటం, నచ్చిన వారిని  కొనసాగించడం వంటి చర్యలకు శ్రీకారం పలికారు.  స్థానిక ఎన్నికల్లో వారిని వినియోగించుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను తీవ్రంగా చేశారు. 


ఇటు సమాచారం.. అటు బెదిరింపులు 

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు ఓటర్లకు సంబంధించిన సమాచారం ఇవ్వటంలోనూ, ఆపై ఓటర్లను హెచ్చరించి అధికార పార్టీ మద్ధతు అభ్యర్థులకు ఓటు వేసేలా చేయటంలోనూ వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. పింఛన్‌, అమ్మఒడి లాంటి సంక్షేమ ఫలాలు అందాలన్నా, తెల్లరేషన్‌ కార్డులు నిలవాలన్నా చెప్పినట్లు ఓటేయండంటూ బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వివిధ కారణాలతో పలుచోట్ల వలంటీర్లు ప్రత్యక్షంగా అధికార పార్టీకి సహకరించడానికి వెనుకంజ వేశారు. అలాంటి వారందరినీ గుర్తించి రకరకాల సాకులతో వారిని విధుల నుంచి తొలగించే కార్యక్రమాన్ని ప్రస్తుతం అధికార పార్టీ ప్రారంభించింది.  ఇప్పటికే జిల్లాలో ఆయా నియోజకవర్గాలలో 50 మంది వరకూ వాలంటీర్లుని తొలగించటం అందుకు నిదర్శనం. 


పురపోరులో తాయిలాలు కూడా 

పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అధికార పార్టీ నేతలు మున్సిపల్‌ ఎన్నికల్లో వారిని మరింతగా వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. తదనుగుణ ంగా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వలంటీర్లతో సంబంధిత అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారిని ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రంగంలో ఉన్న వైసీపీ అభ్యర్థులకు వార్డు, డివిజన్‌ నాయకులకు సూచనలు చేశారు. దీనికితోడు వార్డు వాలంటీర్లకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు కూడా అందినట్లు తెలుస్తోంది. 


వలంటీర్లతో అధికార పార్టీ నేతల సమావేశం 

అందిన సమాచారం మేరకు ఇప్పటికే అన్ని పట్టణ సంస్థల పరిధిలోని అధికార పార్టీ నేతలు వలంటీర్లతో సమావేశమయ్యారు. ముందుగా వలంటీరు పరిధిలో ఉన్న 50 కుటుంబాలలో యజమాని, ఆ ఇంట్లో ఉన్న ఓటర్లు, వారి జీవనాధారం తదితర సమాచారాన్ని తీసుకుంటున్నారు. వారి రాజకీయ అభిప్రాయాలను కూడా తెలుసుకోమని వలంటీర్లుకి హుకుం జారీ చేశారు. ఆ సమాచారానికి అనుగుణ ంగా వివిధ రూపాల్లో ప్రత్యర్థి పక్షం వైపు మొగ్గుతున్నవారిని సంక్షేమ పథకాలు కోల్పోతారన్న పేరుతో బెదిరించమని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఉద్యోగం ఉండాలంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా సూచిస్తున్నారు. దీంతో అనేక వార్డుల్లో వలంటీర్లు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారు.


తాయిలాలతో వల

ఇంకోవైపు వలంటీర్లను మరింత లోబర్చుకునేందుకు ఇతర్రతా తాయిలాలను ఆశ చూపుతున్నారు. ఆయా వార్డులు, డివిజన్లలో రంగంలో ఉన్న అభ్యర్థులు పార్టీ ఆదేశాలకు తోడు మేమూ మీకు సహకరిస్తామంటూ వలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరంలో అయితే కొంతమంది అభ్యర్థులు వారి పరిధిలోని ప్రతి వలంటీర్‌కు కొంత నగదు పారితోషకాన్ని కూడా ప్రకటిస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీ ఒత్తిడి, ప్రలోభాల పర్వం పెరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల అనుభవంతో వలంటీర్ల పాత్రపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజల నిఘా కూడా పెరిగింది. ఫలితంగా పలుచోట్ల వారి దూకుడుకు సాధారణ  ప్రజలే బ్రేకు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వలంటీర్ల విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో వలంటీర్లలో కొంతమేర భయం కూడా పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో పురపోరు పూర్తయ్యేలోపు వలంటరీ వ్యవస్థ మరింత వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST