డ్వాక్రా ఓట్లు వయా ఆర్పీలు

ABN , First Publish Date - 2021-03-08T10:24:58+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళా సంఘాల ఓట్లపై గురిపెట్టిన అఽధికార పార్టీ.. అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తోంది.

డ్వాక్రా ఓట్లు వయా ఆర్పీలు

గ్రేటర్‌ వైజాగ్‌లో వైసీపీ ప్రలోభాలు 

విశాఖపట్నంలో 30 వేల సంఘాలు

మొత్తం 3.3 లక్షల మంది సభ్యులు

కుటుంబాలతో కలిపి నగరంలో సగం ఓట్లు 

గంపగుత్తగా వేయించాలని ఆర్పీలపై ఒత్తిడి

ఒక్కో ఉద్యోగికి రూ.30 వేల నగదు!

సీవో, ఇతర ఉద్యోగులకు భారీ నజరానాలు


విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళా సంఘాల ఓట్లపై గురిపెట్టిన అఽధికార పార్టీ.. అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తోంది. ప్రతి సంఘంలోని సభ్యులంతా వైసీపీకి ఓటు వేసే బాధ్యత తీసుకోవాలంటూ రిసోర్స్‌ పర్సన్లను (ఆర్పీలు) ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆర్పీలతో పాటు  పైస్థాయిలో ఉండే కమ్యూనిటీ ఆర్గనైజర్లకు (సీవో) వారి ‘స్థాయి’ని బట్టి ప్యాకేజీ ఇచ్చినట్టు సమాచారం. ఒక్కో ఆర్పీకి రూ.30 వేలు, సీవోకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నగదును కవర్లలో పెట్టి అందజేశారని ప్రచారం సాగుతోంది. నగరంలో పేరొందిన నాలుగైదు షాపింగ్‌ మాల్స్‌కు ఆర్పీలను రప్పించి, ప్రతి ఒక్కరికీ బ్యాగ్‌ అందజేసినట్టు తెలుస్తోంది.


ఎవరికీ అనుమానం రాకుండా, షాపింగ్‌ చేసినట్టుగా మాల్‌కు చెందిన బ్యాగ్‌ ఇచ్చి పంపారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ నగదు పంపిణీ వ్యవహారం ఆదివారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆపై అధికారులను శ్రీకాకుళం తీసుకెళ్లి విందు ఏర్పాటుచేసి అక్కడ భారీగా బహుమతులు అందజేశారని ప్రచారం సాగుతోంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 30 వేల డ్వాక్రా సంఘాల్లో 3.3 లక్షల మంది సభ్యులున్నారు. నగరంలో 17 లక్షలకుపైగా ఓటర్లున్నారు. డ్వాక్రా మహిళలు, వారి కుటుంబంలో ఓటు హక్కు ఉన్న వారిని కలిపితే దాదాపు సగం మంది ఉంటారు.


దీంతో డ్వాక్రా సంఘాలను లక్ష్యంగా చేసుకుని అధికారిక సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనాలని ఆర్పీల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. రాకపోతే రుణాల వడ్డీ రాయితీ రద్దు చేస్తామని, రుణమాఫీని అమలు చేసేది లేదని హెచ్చరిస్తున్నారు. కాగా డ్వాక్రా సంఘాల సభ్యులను అధికార పార్టీ నేతల సమావేశాలకు రప్పించడానికి సహకరించని ఆర్పీలను ఇప్పటికే తొలగించారు. టీడీపీ, సీపీఎం నాయకులు.. ఈ వ్యవహారంపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-08T10:24:58+05:30 IST