నీదా.. నాదా?

ABN , First Publish Date - 2020-12-15T06:22:04+05:30 IST

వృద్ధిమాన్‌ సాహా.. రిషభ్‌ పంత్‌. ఆస్ట్రేలియాతో జరిగే గులాబీ టెస్టులో వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పోటీలో ఉన్న ఆటగాళ్లు. ఓపెనింగ్‌, మిడిలార్డర్‌పై స్పష్టత వచ్చినప్పటికీ కీపర్‌ బాధ్యతలు తీసుకునేదెవరో ఆసక్తికరంగా మారింది...

నీదా.. నాదా?

  • కీపర్‌ చాన్స్‌ దక్కేదెవరికో?


వృద్ధిమాన్‌ సాహా.. రిషభ్‌ పంత్‌. ఆస్ట్రేలియాతో జరిగే గులాబీ టెస్టులో వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పోటీలో ఉన్న ఆటగాళ్లు. ఓపెనింగ్‌, మిడిలార్డర్‌పై స్పష్టత వచ్చినప్పటికీ కీపర్‌ బాధ్యతలు తీసుకునేదెవరో ఆసక్తికరంగా మారింది. వెటరన్‌ సాహాతో పాటు యువ ఆటగాడు పంత్‌ కూడా ఫామ్‌లోకి రావడం ఇప్పుడు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ భారత కీపర్లు వృద్ధిమాన్‌ సాహా, యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ తమ సత్తాను నిరూపించుకోగలిగారు. ఇదే ఇప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌కు ‘తలనొప్పి’గా మారింది. తొలి వామప్‌ మ్యాచ్‌లో కీపర్‌ సాహా కీలక అర్ధసెంచరీ జట్టును ఓటమి నుంచి కాపాడింది. ఇక గులాబీ టెస్టు కోసం సన్నాహకంగా జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పంత్‌ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్‌తో నిష్క్రమించినా ఆ తర్వాత మాత్రం అతడు బ్యాట్‌ ఝుళిపిస్తూ 73 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో అడిలైడ్‌లో ఈనెల 17 నుంచి జరిగే తొలి టెస్టులో ఎవరిని బరిలోకి దించాలా? అనే డైలమాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉందనడంలో సందేహం లేదు.


సాహాకే అనుకూలమా!

ఆసీస్‌ ‘ఎ’తో పంత్‌ ఆడిన తీరు చూస్తే డే/నైట్‌ టెస్టులో కీపర్‌ బాధ్యతలు అతడికే అప్పగిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్‌ మాత్రం సాహా వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్‌ను మాత్రమే లెక్కలోకి తీసుకోకుండా వికెట్ల వెనకాల అద్భుత ప్రతిభను కొలమానంగా భావించాలని జట్టు భావిస్తోంది. అందుకే 36 ఏళ్ల సాహానే ఇందుకు సరైనవాడని ఆలోచిస్తోంది. అటు ఈ బెర్త్‌పై జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉందని విహారి కూడా సంకేతాలు ఇచ్చాడు. పంత్‌, సాహాలలో ఒకరిని ఎంపిక చేసుకోవడం సవాల్‌తో కూడుకుందని అతను తెలిపాడు. కీపర్‌గా మెరుగైన రికార్డు కలిగిన సాహా.. ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గానూ రాణించడం అతనికి అనుకూలంగా మారనుంది. తొలి వామప్‌లో భారత్‌ ‘ఎ’ 143/9 స్కోరుతో  ఓటమి అంచున నిలిచిన దశలో చివరి బ్యాట్స్‌మన్‌ కార్తీక్‌ త్యాగికి తగిన సూచనలిస్తూ సాహా అర్ధసెంచరీతో మ్యాచ్‌ను కాపాడాడు. ఈ సమయంలో అతను ప్యాటిన్సన్‌, మైకేల్‌ నెసెర్‌, కామెరూన్‌ గ్రీన్‌ల పదునైన బంతులను ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు. అదే పంత్‌ విషయానికి వస్తే.. రెండో మ్యాచ్‌, రెండో ఇన్నింగ్స్‌లో అతడు క్రీజులోకి వచ్చే సరికే భారత్‌ పటిష్ఠ స్థితిలో ఉంది. గిల్‌, మయాంక్‌, విహారి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పంత్‌ వీరవిహారం చేశాడు. మరోవైపు ఆసీస్‌ ‘ఎ’ పస లేని బౌలింగ్‌ ను దిగ్గజ ఆటగాడు బోర్డర్‌ కూడా విమర్శించాడు. ఓవరాల్‌గా 37 టెస్టుల్లో సాహా 30కి పైగా సగటుతో 1238 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు 92 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లున్నాయి.


అయినా  పంత్‌తో పోటీనే..

ఒకవేళ తొలి టెస్టులో సాహాకు చోటు దక్కినా 23 ఏళ్ల పంత్‌కు దారులు మూసుకుపోయినట్టేమీ కాదు. కచ్చితంగా అడిలైడ్‌ మ్యాచ్‌లో సాహా సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కీపర్‌గా అతడి నైపుణ్యానికి లోటు లేకపోయినా బ్యాటింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడాలి. అలా అయితేనే పంత్‌ రూపంలో ఉన్న ప్రమాదం నుంచి సాహా గట్టెక్కగలుగుతాడు. వాస్తవానికి భారత జట్టు చివరి మూడు విదేశీ (ఆసియా ఆవల) పర్యటనలైన ఇంగ్లండ్‌, ఆసీస్‌, కివీ్‌సలలో కీపర్‌గా పంత్‌కే చోటు దక్కింది. ఈ సమయంలో సాహా పూర్తి ఫిట్‌గానే ఉండడం గమనార్హం. ఇక.. రెండో వామ్‌పలో సెంచరీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టు పంత్‌ చెబుతున్నాడు. పంత్‌ ఎడమ చేతి వాటం ఆటగాడు కావడం కూడా అనుకూలాంశమే. జడేజా గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో టీమ్‌లో పంత్‌ ఒక్కడే లెఫ్టామ్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పంత్‌ చాన్స్‌ను తోసిపుచ్చలేం.


Updated Date - 2020-12-15T06:22:04+05:30 IST