వీఆర్వోల వ్యథ..!

ABN , First Publish Date - 2021-01-17T05:37:01+05:30 IST

జిల్లాలో గతంలో బదిలీలపై వెళ్లిన గ్రామ రెవెన్యూ అధికారులు ఐదునెలలుగా జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

వీఆర్వోల వ్యథ..!

నిషేధ ఉత్తర్వులున్నా బదిలీలు 

జీతాల చెల్లింపునకు ఖజానశాఖ కొర్రీలు

క్యాడర్‌ బలం కంటే ఎక్కువ బదిలీలు జరిగినందునే 

ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు


గుంటూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతంలో బదిలీలపై వెళ్లిన గ్రామ రెవెన్యూ అధికారులు ఐదునెలలుగా జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అన్నిస్థాయిల్లో బదిలీలపై ప్రభు త్వం నిషేధం విధించినా జిల్లా రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకోకుండా పరిపాలన సౌలభ్యం పేరుతో బదిలీలు చేశారు. క్యాడర్‌ బలం కంటే అధికసంఖ్యలో బదిలీలు జరగడం, ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా బదిలీలు చేయడంతో వీఆర్వోల జీతాల బిల్లులను నిలిపేసి కొర్రీలు వేసి ఖజాన శాఖ అధికారులు వెనక్కు పంపుతున్నారు. దాదాపుగా 85 మంది వీఆర్వోలు ఐదు నెలల నుంచి జీతాలు అందుకోలేకపోతున్నారు.  పండుగ కూడా జరుపుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలై నుంచి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా సిఫార్సు లేఖలను వీఆర్వోలకు ఇచ్చారు. ఫలాను వీఆర్వోలు వద్దని, తాము సూచించిన వారికి గ్రామాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు చేశారు. ఒకపక్క బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా కలెక్టరేట్‌ పరిపాలన విభాగం పెద్దసంఖ్యలో ఫైళ్లని నడిపింది. కనీసం ఉన్నతాధికారులు కూడా వాటిని నిలుపుదల చేయకుండా ఆమోదించేశారు. దీంతో గుంటూరు తూరు, పశ్చిమ, తెనాలి, నరసరావుపేట, వినుకొండ తదితర మండలాలకు శాంక్షన్‌ అయిన వీఆర్వో పోస్టుల కంటే ఎక్కువ మంది బదిలీపై వచ్చారు. కాగా కొన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విధంగా క్యాడర్‌ బలం కంటే ఎక్కువ సంఖ్యలో బదిలీలు జరిగినట్లు ఖజాన శాఖ వర్గాలు గుర్తించాయి. ఏ మండలాల్లో అయితే ఇలా నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయో సంబంధిత వీఆర్వోల జీతాల బిల్లులను నిలిపేశాయి. దీనిపై వీఆర్వోల సంఘం జిల్లా నాయకులు ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారో తెలియక  వీఆర్వోలు తలలు పట్టుకొంటున్నారు.  

Updated Date - 2021-01-17T05:37:01+05:30 IST