త్రిశంకు స్వర్గంలో వీఆర్‌ఓలు

ABN , First Publish Date - 2021-01-21T06:15:07+05:30 IST

మొన్నటి వరకు రెవెన్యూవ్యవస్థలో కీలకపాత్ర పోషించిన వీఆర్‌ఓలు ప్రస్తుతం అదే కార్యాలయాల్లో వెట్టిచాకిరి తరహా పనులకు పరిమితమైపోతుండడం రెవెన్యూశాఖలో చర్చకు కారణమవుతోంది.

త్రిశంకు స్వర్గంలో వీఆర్‌ఓలు

వ్యవస్థ రద్దయి ఐదునెలలు గడుస్తున్నా విధులపై స్పష్టత కరువు 

జాబ్‌చార్ట్‌ లేక జిల్లాలోని రెవెన్యూ ఆఫీసుల్లోనే పడిగాపులు 

అన్ని రకాల పనులు అంటగడుతున్న అధికారులు 

క్షేత్రస్థాయిలో సర్టిఫికెట్ల విచారణలకు ఆటంకం 

భూముల వ్యవహారంలోనూ ఇక్కట్లు 

రెవెన్యూశాఖలోనే తమను కొనసాగించాలంటూ డిమాండ్‌ 

నిర్మల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : మొన్నటి వరకు రెవెన్యూవ్యవస్థలో కీలకపాత్ర పోషించిన వీఆర్‌ఓలు ప్రస్తుతం అదే కార్యాలయాల్లో వెట్టిచాకిరి తరహా పనులకు పరిమితమైపోతుండడం రెవెన్యూశాఖలో చర్చకు కారణమవుతోంది. గ్రామపంచాయతీల్లోని అన్ని రకాల భూముల వ్యవహార కార్యకలాపాలను ఆ భూములకు సంబంధించిన రికార్డులను పర్యవేక్షించడమే కాకుండా ఆ గ్రామంలో అన్ని రకాల ప్రోటోకాల్‌ వ్యవహారాలను వీఆర్‌ఓలు నిర్వర్తించేవారు. అయితే భూముల వ్యవహారాల్లో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడుతూ రెవెన్యూవ్యవస్థకు అప్రతిష్టను మూటగడుతున్నారన్న ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ మొత్తం వీఆర్‌ఓ వ్యవస్థను ఇటీవలే రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఆర్‌ఓలందరినీ ఇతర ప్రభుత్వశాఖల్లోని ఖాళీపోస్టుల్లో నియమిస్తామంటూ కూడా సీఎం ప్రకటించారు. గత ఐదునెలల క్రితం వీఆర్‌ఓ వ్యవస్థ రద్దయినప్పటికీ ఇప్పటి వరకు వారిని ఏ ఒక్కశాఖకు కూడా కేటాయించలేదు. వీరిని ఏ స్థాయిలో ఏఏ శాఖల్లో నియమించాలన్న అంశంపై గాని స్పష్టమైన జాబ్‌చార్ట్‌పై గాని ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించలేదు సరికదా దీనికి సంబంధించి స్పష్టమైన విధానాన్ని సైతం ఖరారు చేయలేదు. దీంతో గత నాలుగైదు నెలల నుంచి వీఆర్‌ఓలంతా సంబంధిత మండల, రెవెన్యూ కార్యాలయాలకే పరిమితమైపోతున్నారు. వీఆర్‌ఓలు ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వం వీరందరికీ వివిధశాఖల్లో పోస్టులు క్రియేట్‌ చేసి వీరిని ఆ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. అయితే వీఆర్‌ఓ వ్యవస్థ రద్దైన నాటి నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన పనులకు పెద్దఎత్తున ఆటంకాలు తలెత్తుతున్నాయి. గిర్ధావార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌ స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన రికార్డులు, పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌, రిజిస్ర్టేషన్‌ల లాంటి పనులకు ఆటంకాలు సైతం తలెత్తుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల విచారణ ప్రక్రియకు వీఆర్‌ఓలు లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. అయితే ఎలాంటి జాబ్‌చార్ట్‌ లేకపోవడం, వ్యవస్థ రద్దు కావడంతో తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఖాళీగా ఉంటున్న వీఆర్‌ఓలను సంబంధిత అధికారులు అన్ని రకాల పనులకు వినియోగించుకుంటున్నారన్న వాదనలున్నాయి. మొన్న టి వరకు ఓ నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్‌తో విధులు నిర్వహించిన వీఆర్‌ఓలు ప్రస్తుతం ఎలాంటి పనిచేయాలో తెలియక సందిగ్ధతకు లోనవుతున్నారు. అధికారులు మాత్రం వీరికి ఏదో ఓ రకమైన పని అప్పజెప్పుతూ తమ భారాన్ని తగ్గించుకుంటున్నారంటున్నారు. ఇదిలా ఉండగా గత నాలుగైదు నెలల నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో తాము ఖాళీగా ఉంటున్నామని తమను వెంటనే రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని వీఆర్‌ఓ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. 

గ్రామీణస్థాయిలో భూముల వ్యవహారాలపై ప్రభావం

మొన్నటి వరకు గ్రామస్థాయిలో అన్ని రకాల భూముల వ్యవహారాలు, ఆ భూములకు సంబంధించిన రికార్డుల పర్యవేక్షణతో పాటు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రోటోకాల్‌ నిర్వహణ, ఇతర విధులను వీఆర్‌ఓలు నిర్వహించేవారు. ప్రభుత్వం అనూహ్యంగా వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేయడంతో భూముల వివాదాలపై ప్రభావం చూపుతోందంటున్నారు. భూ వివాదాలే కాకుండా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో కూడా వీఆర్‌ఓలు కీలకపాత్ర పోషించేవారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికలో వీరు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు రూపొందించేవారు. ఈ నివేదికల ప్రకారమే లబ్దిదారుల ఎంపిక జరిగేది. ప్రస్తుతం వీఆర్‌ఓలు లేకపోవడంతో ఈ వ్యవహారాలపై ప్రభావం పడుతోందంటున్నారు. దీంతో పాటు గ్రామాలకు వీఐపీలు పర్యటించే సమయంలో కూడా అక్కడి ప్రోటోకాల్‌ భాధ్యతనంతా వీఆర్‌ఓలు తీసుకునేవారు. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నీ పై స్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి వస్తుండడంతో వారిపై అదనపు భారం పడుతోందంటున్నారు. 

ఐదు నెలల నుంచి స్పష్టత కరువు

వీఆర్‌ఓ వ్యవస్థను రద్దుచేసి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రత్యామ్నాయంపై స్పష్టత రాకపోవడం చర్చకు కారణమవుతోంది. వీఆర్‌ఓలందరినీ ఇతర శాఖల్లో నియమిస్తామంటూ ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుల్లో వీరికి కేటాయింపులు ఉంటాయని తెలిపింది. అయితే వ్యవస్థ రద్దై ఐదు నెలల గడుస్తున్న ఇప్పటి వరకు వీరి నియమకాలపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకపోవడం గందరగోళం సృష్టిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 మందికి పైగా వీఆర్‌ఓలు ఆయా జిల్లాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో 113 మంది వీఆర్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దయిన నాటి నుంచి వీరంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వ్యవస్థ రద్దు కాగానే తమ జాబ్‌చార్ట్‌ కూడా రద్దు కావడంతో తాము ఎలాంటి విధులు నిర్వహించాలో తెలియడం లేదంటున్నారు. పై అధికారులు కూడా వీరితో ఎలాంటి పనులు అధికారికంగా చేయించాలన్న దానిపై స్పష్టత లేక సంశయానికి లోనవుతున్నారు. అధికారేతర పనులు అనగా బాధ్యత లేని పనులను వీరితో చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ స్థాయి అధికారులంతా ప్రస్తుతం వీరితో తమ విధులకు సహాయం అందించే పనులను మాత్రమే చేయిస్తున్నారని చెబుతున్నారు. 

రెవెన్యూలోనే సర్దుభాటు చేయాలంటున్న వీఆర్‌ఓలు

రెవెన్యూవిధుల్లో తమకున్న అనుభవం కారణంగా తమను అదే శాఖ లో కొనసాగించాలని వీఆర్‌ఓలు కోరుతున్నారు. తమకున్న అర్హతలను బట్టి రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు పోస్టులను నియమించాలని దీంతో పాటు జూనియర్‌ ఆర్‌ఐ పోస్టుల్లో సైతం తమను సర్దుభాటు చేయాలని వీరు పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖలో అదనపు పోస్టులను క్రియేట్‌ చేసి తమను ఆ పోస్టుల్లో సర్ధుబాటు చేయాలంటున్నారు. భూములకు సంబందించిన రికార్డుల పర్యవేక్షణ, అలాగే క్షేత్రస్థాయిలో అవసరమయ్యే కార్యకలాపాలను నిర్వర్తించడంలో తమకు అనుభవం ఉందని అలాంటి పనులకు సంబంధించిన పోస్టుల్లో తమను నియమించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి

 ప్రభుత్వం వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసినప్పటికి తమ సర్దుభాటు విషయంలో ఇప్పటికి స్పష్టతనివ్వలేదు. ఇతర శాఖల్లో తమను సర్దుబాటు చేసే కన్నా రెవెన్యూశాఖలోనే అర్హతలను బట్టి వివిధ పోస్టుల్లో నియమించాలి. ప్రస్తుతం తామంతా తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జాబ్‌చార్ట్‌ లేని కారణంగా అన్ని రకాల పనులను చేయాల్సి వస్తోంది. కొంతమంది తహసీల్దారులు వివక్ష చూపుతున్నారు. 

- ఎన్‌టి. రాజేశ్వర్‌, వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2021-01-21T06:15:07+05:30 IST