మాటల్లో లక్ష్యం.. సౌకర్యాలపై అలక్ష్యం!

ABN , First Publish Date - 2020-02-22T10:44:44+05:30 IST

మాటల్లో లక్ష్యం.. సౌకర్యాలపై అలక్ష్యం!

మాటల్లో లక్ష్యం.. సౌకర్యాలపై అలక్ష్యం!

గ్రామ, వార్డు సచివాలయాల్లో అట్టహాసంగా బోర్డులు ఏర్పాటు                 

నేటికీ చాలా చోట్ల కానరాని ఇంటర్నెట్‌, ప్రింటర్‌, కంప్యూటర్లు        

పౌరులకు సకాలంలో సేవలు అందడంపై అనుమానాలు!

రెవెన్యూ కార్యాలయంలో మూలకు చేరిన సిటిజన్‌ చార్టర్‌ బోర్డు


నర్సీపట్నం, ఫిబ్రవరి 21 : ప్రజల చెంతకే పాలన అనే రీతిలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు గ్రామ స్థాయిలోనే అం దుబాటులోకి వచ్చాయని పాలకులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు ఎన్నెన్ని రోజుల్లో ఏఏ సేవలు అందుతాయనే సమాచారాన్ని తెలియజేస్తూ ప్రముఖంగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బదిని నియమించకపోగా ఇంటర్నెట్‌, ప్రింటర్‌, కంప్యూటర్‌ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం సచివాలయాలకు వచ్చే ప్రజలకు సకాలంలో ఎలా సేవలు అందించగలమని సిబ్బంది వాపోతున్నారు. 


72 గంటల్లోగా ఏ పనైనా ఎలా సాధ్యం?

సచివాలయాల్లో దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా ఏ పనైనా పూర్తవుతుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు ఎంత మేరకు అమలవుతాయి అనేది ప్రశ్నార్ధకంగా మారింది.  సచివాలయాల్లో మొత్తం 237 రకాల సేవలు అందిస్తామని, వాటిలో 115 రకాల సేవలు 72 గంటల్లోపే ప్రజలకు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఒక్కచోట కూడా పూర్తిస్థాయిలో సచివాలయం పనిచేయడం లేదని ఉద్యోగులే అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిటిజన్స్‌ చార్టర్‌ అమలు ఏ విధంగా చట్టబద్ధం అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


మూలకు చేరిన పౌరసేవా పత్రం 

 కాగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన  నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పౌర సేవా పత్రం బోర్డును రికార్డు రూమ్‌లో భద్రపరిచారు. కొద్ది నెలల క్రితం పదవీ విరమణ చేసిన ఒక రెవెన్యూ అధికారి తన చాంబర్‌ పక్కనే ఉండే సదరు బోర్డును తొలగించి రికార్డు రూమ్‌లో దాచిపెట్టారు. దీంతో ఇక్కడ ప్రజలకు అందాల్సిన సేవలు మరింత జాప్యమవుతున్నాయి. అయితే ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. సిటిజన్స్‌ చార్టర్‌ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం కష్టమని, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో సాధ్యం కాదని ఆ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

Updated Date - 2020-02-22T10:44:44+05:30 IST