తాండవ ‘ఖర్మా’గారం!

ABN , First Publish Date - 2020-02-22T10:48:00+05:30 IST

తాండవ ‘ఖర్మా’గారం!

తాండవ ‘ఖర్మా’గారం!

లక్ష్యానికి దూరంగా క్రషింగ్‌

వాతావరణం అనుకూలించక, తెగుళ్లు సోకడంతో తగ్గిన చెరకు దిగుబడి

ఆర్థిక ఇబ్బందులతో బయట కొనుగోలు చేయలేని పరిస్థితి

లక్ష్యం లక్ష టన్నులు కాగా, ఇప్పటి వరకు 58,837 టన్నులు క్రషింగ్‌

మరో ఐదు వేల టన్నులు మాత్రమే చెరకు వచ్చే అవకాశం

ఇప్పటికీ అందని ఎన్‌సీడీసీ రెండో విడత సాయం

పంచదార కుదువ పెట్టి రూ.4.15 కోట్ల బకాయిల చెల్లింపులు


పాయకరావుపేట, ఫిబ్రవరి 21 : ఇక్కడి తాండవ సహకార చక్కెర కర్మాగారం ఈ ఏడాది క్రషింగ్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు పంట దిగుబడులు తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని సమాచారం. ఈ ఏడాది సీజన్‌లో లక్ష టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంకాగా, ఇప్పటి వరకు 58,837 టన్నుల చెరకు గానుగ ఆడారు. మరో ఐదు వేల టన్నుల వరకు మాత్రమే చెరకు వచ్చే అవకాశముందని ఫ్యాక్టరీ అధికారులు చెబుతుండడం ఇందుకు నిదర్శనం.


2,600 మంది సభ్య రైతులతో ఒప్పందాలు

తాండవ షుగర్స్‌లో 2019-20 క్రషింగ్‌ సీజన్‌లో లక్ష టన్నుల చెరకు గానుగ ఆడాలని నిర్ణయించారు. 80,000 టన్నుల చెరకు సరఫరా కోసం ఫ్యాక్టరీ పరిధిలో 770 ఎకరాల్లో మొక్క తోటలు, 3,600 ఎకరాల్లో కార్సి తోటలు కలిపి 4,370 ఎకరాల్లో చెరకు పంట వేసిన 2,600 మంది సభ్య రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. అదే విధంగా బయటి ప్రాంతాల నుంచి మరో 20,000 టన్నులు వచ్చే అవకాశం ఉన్నందున మొత్తం లక్ష టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి రెండో తేదీన ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభించారు. అయితే ఈ సీజన్‌లో వర్షాలు ఆలస్యంగా కురవడం, వాతావరణం అనుకూలించక పోవడం, చెరకు పంటను పసుపు ఆకు తెగులు అధికంగా ఆశించడంతో ఫ్యాక్టరీ పరిధిలో పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. 


ఎకరానికి 10 నుంచి 12 టన్నులే దిగుబడి

ఎకరానికి ఇరవై టన్నులకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం పది నుంచి పన్నెండు టన్నుల వరకు మాత్రమే దిగుబడి రావడంతో ఫ్యాక్టరీకి ఆ మేరకు చెరకు సరఫరా తగ్గిపోయింది. దీంతో తాండవ షుగర్స్‌లో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 45 రోజుల్లో 58,837 టన్నుల చెరకు క్రషింగ్‌ జరిగి 9.01 శాతం రికవరీతో 46,800 బస్తాల పంచదార దిగుబడి సాధించింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ కాటాల పరిధిలో ఉన్న సుమారు ఐదు వేల టన్నుల చెరకు గానుగ ఆడి ఈ ఏడాది కనీసం 62,000 టన్నులైనా క్రషింగ్‌ చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఇక బయట ప్రాంతాల నుంచి చెరకు తెచ్చుకునేందుకు రైతులకు పేమెంట్‌ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేక ప్రస్తుత క్రషింగ్‌ సీజన్‌ను మరి కొద్ది రోజుల్లో నిలిపి వేయాలని నిర్ణయించింది. 

Updated Date - 2020-02-22T10:48:00+05:30 IST