క్యాష్‌కు కటకట

ABN , First Publish Date - 2020-09-23T08:22:45+05:30 IST

జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్‌ ఆసరా...ఇలా పథకం ఏదైనప్పటికీ లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీయే ప్రభుత్వ లక్ష్యంగా మారింది.

క్యాష్‌కు కటకట

పట్టణ, గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరత

సంక్షేమ పథకం ప్రారంభించిన మరుసటిరోజే

బ్యాంకులకు పోటెత్తుతున్న లబ్ధిదారులు

ఒకేసారి భారీ మొత్తంలో నగదు చెల్లించలేక అధికారుల అగచాట్లు

డబ్బుల సర్దుబాటు కోసం పాట్లు 

ఆర్‌బీఐ నిబంధనలే కారణమంటున్న బ్యాంకర్లు

రోజుకు కొన్ని గ్రామాల లబ్ధిదారులకు చెల్లింపులు


నర్సీపట్నం, సెప్టెంబరు 21:

జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్‌ ఆసరా...ఇలా పథకం ఏదైనప్పటికీ లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీయే ప్రభుత్వ లక్ష్యంగా మారింది. ఆయా పథకాలను ప్రారంభించిన మరునాడే లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును డ్రా చేయడానికి బ్యాంకులకు వస్తున్నారు. ఒకేసారి వేలాది మంది రావడంతో బ్యాంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంకుల్లో నగదు నిల్వలు తగినంత లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది. 


బ్యాంకుల అవసరాలకు తగ్గట్టు నగదు సరఫరా చేయడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఖాతాదారులు బ్యాంకులకు రాకుండా నగదు పొందడానికి ఏర్పాటుచేసిన ఏటీఎం కేంద్రాల్లో నెలలో పది రోజులు కూడా నగదు నిల్వలు వుండడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో (నగదు చెల్లింపు) జాతీయ బ్యాంకులు నానా హైరానా పడుతున్నాయి.


అమ్మఒడి, రైతుభరోసా, చేయూత, ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ తదితర పథకాలకు సంబంధించిన డబ్బు (చెక్కులు)ను ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నది. ఈ పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. పథకం ప్రారంభించిన లేదా నిధులు మంజూరైన మరుసటిరోజే డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులకు వస్తున్నారు. ఒక్కో బ్యాంకు వద్ద వందలాది మంది బారులు తీరుతున్నారు. ఒకేసారి భారీమొత్తంలో చెల్లించాల్సి రావడం, ఆ మేరకు బ్యాంకులో నగదు లేకపోవడంతో  అధికారులు నానాపాట్లు పడుతున్నారు. 


విశాఖ నగరంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలోని బ్యాంకుల్లో నగదు కొరత అధికంగా ఉంటున్నది. గ్రామీణ ప్రాంతంలోని బ్రాంచీలకు పరిమితంగా నగదు సరఫరా కావడం, ఆన్‌లైన్‌ లావాదేవీలు తక్కువగా వుండడం వంటి కారణాల వల్ల ఇటువంటి సమయాల్లో (నగదు బదిలీ పథకాలు ప్రారంభించినప్పుడు) లబ్ధిదారులకు నగదు చెల్లింపుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తున్నదని నర్సీపట్నంలోని ఒక జాతీయ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ అన్నారు.


నగరాల్లోని బ్యాంకులకు కేటాయిస్తున్న రీతిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు కూడా అవసరమైనంత నగదును రిజర్వ్‌ బ్యాంకు కేటాయించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. నర్సీపట్నంతోపాటు పాడేరు, అరకులోయ, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, తదితర పట్టణాల్లోని బ్యాంకుల వద్ద గత కొద్దిరోజుల నుంచి రద్దీ అధికంగా ఉంటున్నది.


వీరిలో అత్యధికులు ‘ఆసరా’ డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన డ్వాక్రా సంఘాల సభ్యులే ఉంటున్నారు. కాగా బ్యాంకుల్లో నగదు నిల్వలకు, చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా వుండడంతో నగదు చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో డబ్బులు డ్రా చేయడానికి వచ్చినవారు గంటల తరబడి క్యూలో వేచివుండాల్సి వస్తున్నది. 


నగదు కొరతతో అవస్థలు...ప్రసాద్‌, మేనేజర్‌, ఏపీజీవీబీ

మా బ్రాంచిలో 430 డ్వాక్రా సంఘాల సభ్యులకు ఖాతాలు ఉన్నాయి. ఆయా సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సొమ్మును తక్కువ సమయంలో చెల్లించేందుకు అవసరమైన నగదు సర్దుబాటు కావడం లేదు. రోజూ 20 గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.40 లక్షల వరకు చెల్లింపులు జరపాలి.


అంత నగదును లీడ్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ఇవ్వకపోవడంతో ప్రైవేటు బ్యాంకుల నుంచి తీసుకువస్తున్నాం. నగదు కొరత కారణంగా రోజూ 30 డ్వాక్రా సంఘాలకు మాత్రమే చెల్లింపులు జరిపేలా షెడ్యూల్‌ను రూపొందించుకుని అమలు చేస్తున్నాం.

Updated Date - 2020-09-23T08:22:45+05:30 IST