ఆగిన ఎస్‌జీటీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-09-26T09:38:51+05:30 IST

డీఎస్‌సీ-2018లో ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) అభ్యర్థులకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ కార్యక్ర

ఆగిన ఎస్‌జీటీ కౌన్సెలింగ్‌

మెరిట్‌ జాబితాలో గందరగోళం..అభ్యర్థుల ఆందోళన..నేడు ఆప్షన్లు స్వీకరణ..కౌన్సెలింగ్‌ రేపు


విశాఖపట్నం/సీతమ్మధార, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): డీఎస్‌సీ-2018లో ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) అభ్యర్థులకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ కార్యక్రమం అర్ధంతరంగా ఆగింది. అభ్యర్థులకు పోస్టులు కేటాయించేందుకు రూపొందించిన మెరిట్‌ జాబితాలో తేడాలు వున్నట్టు గుర్తించడంతో శుక్రవారం చేపట్టిన కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.


తిరిగి ఆదివారం చేపట్టనున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు ఎంపికకు సంబంధించి తొలి జాబితాలో వున్న అభ్యర్థులకు గతంలోనే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఈ సందర్భంగా వారంతా జీవీఎంసీ, పాఠశాల విద్యాశాఖ రెండింటిలో ఎక్కడ పనిచేయాలి అనే దానిపై ఆప్షన్‌ ఇచ్చారు.


అయితే జీవీఎంసీలో తక్కువ ఖాళీలు చూపడంతో కొద్దిమందే జీవీఎంసీకి, మిగిలిన వారంతా పాఠశాల విద్యా శాఖకు ఆప్షన్‌ ఇచ్చారు. జీవీఎంసీలో వున్న పోస్టుల కంటే ఆప్షన్‌ ఇచ్చేవారు తక్కువగా వుండడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. కాగా శుక్రవారం విడుదల చేసిన రెండో జాబితాలో జీవీఎంసీ ఖాళీలు ఎక్కువగా వుండడంతో ఎక్కువ మంది  జీవీఎంసీకి ఆప్షన్‌ ఇచ్చారు.


ఈ విషయం తెలుసుకున్న తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేసి ఆందోళనకు దిగారు. వెంటనే కలెక్టర్‌, పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ నిలిపివేస్తున్నట్టు డీఈవో లింగేశ్వరరెడ్డి ప్రకటించారు. తరువాత సమస్యను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు నివేదించారు.


కమిషనరేట్‌ అధికారుల సూచనల మేరకు మళ్లీ మెరిట్‌ జాబితా రూపొందించారు. ఆ జాబితా ప్రకారం అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో శనివారం అభ్యర్థులు వసంతబాల విద్యావిహార్‌కు హాజరై ఆప్షన్లు ఇవ్వాలని డీఈవో తెలిపారు. ఆదివారం కౌన్సెలింగ్‌ చేపడతామన్నారు. 


Updated Date - 2020-09-26T09:38:51+05:30 IST