Nellore: సాహితీ ప్రియులు, చరిత్రకారులకు.. గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-09-17T04:55:27+05:30 IST

కవిత్రయ మధ్యముడైన..

Nellore: సాహితీ ప్రియులు, చరిత్రకారులకు.. గుడ్‌న్యూస్!
వీఎస్‌యూ

వీఎస్‌యూకు తిక్కన పేరు !

ప్రతిపాదనలు పంపిన విశ్వవిద్యాలయం

ప్రతిష్ఠకు నోచుకోని మహాకవి విగ్రహం


నెల్లూరు: కవిత్రయ మధ్యముడైన మహాకవి తిక్కన తిరుగాడిన నేల. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సీమ. అయినా ఇక్కడ ఆయన ఆనవాళ్లు మిగలకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో సాహితీ ప్రియులు, చరిత్రకారులకు కొంత ఊరట కలిగించే అంశం. జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి తిక్కన పేరును జతచేయనున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి రాష్ట్ర శాసన సభలో ఆమోదం లభించిన తర్వాత న్యూఢిల్లీలోని యూజీసీ అనుమతితో విశ్వవిద్యాలయం పేరు మార్చే అవకాశం ఉంది.


ఎట్టకేలకు

జిల్లాలో 2008లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించే సమయంలో దానికి తిక్కన పేరు పెట్టాలని అప్పట్లో శాసన మండలిలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా పోరాడారు. అయితే జిల్లాలోని శాసన సభ్యులు, మంత్రులు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడంతో అసెంబ్లీలో విక్రమ సింహపురిగానే పేరు ఆమోదం పొందింది. కాగా, పలు జిల్లాల్లో విశ్వవిద్యాలయాలను నన్నయ, వేమన... ఇలా సాహితీకారుల పేరుతో ఏర్పాటు చేయగా మహాకవి తిరుగాడిన నెల్లూరులోని విశ్వవిద్యాలయానికి మాత్రం ఆయన పేరు లేదనే అసంతృప్తి జిల్లా వాసుల్లో ఉండిపోయింది. అయితే ఎట్టకేలకు సుమారు పుష్కరకాలం తర్వాత అయినా విక్రమ సింహపురి ముందు తిక్కన పేరును జత చేసే ప్రతిపాదనలు వెళ్లడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 


విగ్రహానికి మోక్షం ఎప్పుడు?

తిక్కన ద్వారా విశేష కీర్తి గడించిన సింహపురి సీమలో ఆయన విగ్రహం లేకపోవడంపై సాహతీకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో నాటి ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ చొరవ తీసుకుని ఆరు అడుగుల తిక్కన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి నెల్లూరుకు పంపారు. ఆ విగ్రహాన్ని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయించాలని అప్పటి సమాచార శాఖ డైరెక్టర్‌, సాహితీవేత్త విజయ భాస్కర్‌, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో కృషి చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే నాటి కలెక్టర్‌ ముత్యాలరాజుతో స్వయంగా మాట్లాడి తిక్కన విగ్రహ ప్రతిష్ఠకు అంతా సిద్ధం చేశారు. కానీ, సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాతి ఏడాది బాలు అకాల మరణం చెందడంతో విగ్రహ స్థాపన కలగానే నిలిచిపోయింది. ఈ క్రమంలో మహాకవి కాంస్య విగ్రహం ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో మూలనపడి ఉంది. ఈ విషయం మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి వెళ్లినా ఫలితం లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విశ్వవిద్యాల యానికి తిక్కన పేరున జత చేస్తున్న నేపథ్యంలో ఆయన విగ్రహ ప్రతిష్ఠను పూర్తి చేయాలని సాహిత్యాభిమానులు కోరుతున్నారు. 


ప్రతిపాదనలు వాస్తవమే

విశ్వవిద్యాలయానికి పేరు మార్పునకు సంబంధించి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యానికి కూడా తెలియపరిచాము. ఆయన చొరవ చూపితే మరింత వేగవంతంగా విశ్వవిద్యాలయానికి తిక్కన పేరు కలిసే అవకాశం ఉంది.

- ఎల్వీ కృష్ణారెడ్డి, వీఎస్‌యూ రిజిసా్ట్రర్‌

Updated Date - 2021-09-17T04:55:27+05:30 IST