చెత్తబండ్లకు వీటీఎస్‌

ABN , First Publish Date - 2021-09-17T05:01:14+05:30 IST

నెల్లూరు నగరంలో చెత్త సేకరణకు సాంకేతికతను జోడించి పారదర్శకత దిశగా కార్పొరేషన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. చెత్త తరలింపు వాహనాలకు వీటీఎస్‌ (వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను అమర్చి వాహనాల ప్రయాణ మ్యాపింగ్‌ను తయారు చేశారు.

చెత్తబండ్లకు వీటీఎస్‌
చెత్త తరలింపు వాహనానికి వీటీసీ ఏర్పాటు

కార్పొరేషన్‌లో వంద వాహనాలకు ఏర్పాటు 

రూట్‌ మ్యాపింగ్‌తో వ్యర్థాల తరలింపు 

నెలకు 6 వేల లీటర్ల డీజిల్‌ ఆదా...

సచివాలయానికొక వాహనం కేటాయింపు?


నెల్లూరు (సిటీ), సెప్టెంబరు 16 : 

నెల్లూరు నగరంలో చెత్త సేకరణకు సాంకేతికతను జోడించి పారదర్శకత దిశగా కార్పొరేషన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. చెత్త తరలింపు వాహనాలకు వీటీఎస్‌ (వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను అమర్చి వాహనాల ప్రయాణ మ్యాపింగ్‌ను తయారు చేశారు. దీంతో నెలకు 6 వేల లీటర్ల వరకు డీజిల్‌ ఆదా అవుతుండగా రూ. 5.88 లక్షలు నగర పాలిక ఖజనాకు మిగులుతుంది. కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ విధానంలో సచివాయలానికి ఒక వాహనాన్ని త్వరలో కేటాయించనున్నారు. 

నగరంలో రోజూ ఉత్పన్నమవుతున్న వ్యర్థాలను కార్పొరేషన్‌ సిబ్బంది సేకరించి బోడిగాడితోట, దొంతాలిలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం సుమారు 100 వాహనాలున్నాయి. అవన్నీ కార్పొరేషన్‌ వెహికల్‌ షెడ్‌లో డీజిల్‌ పట్టించుకుని చెత్తను ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే ఏ వాహనం ఎక్కడుంది?, ఏ మార్గం గుండా ప్రయాణిస్తోంది?, రోజుకు ఎన్ని ట్రిప్పుల చెత్త తరలించింది? వంటి వాటిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అధికారులు, సిబ్బంది గుడ్డిగా పుస్తకాల్లో లెక్కకడుతున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి వాహనం రాకపోకల లెక్క తేల్చాలని డ్రీమ్‌ స్టెప్‌ ఏజెన్సీకి వీటీఎస్‌ బాధ్యతలను కమిషనర్‌ అప్పగించారు. నెలరోజుల క్రితం అమల్లోకి వచ్చిన ఈ విధానంలో చెత్తను తీసుకెళ్లే ప్రతి వాహనం ఎక్కడుందో స్పష్టంగా తెలిసిపోతుంది. ముందుగానే ఎంపిక చేసిన మార్గంలోనే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాకాకుండా రూటు మారినా, 15 నిమషాలకంటే ఎక్కువ సమయం ఆగినా సంబంధిత అధికారులందరికీ  సమాచారం అందుతుంది. 

కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం

వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను కార్పొరేషన్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. అక్కడి ప్రత్యేక సిబ్బంది వాహనాల ప్రయాణమార్గాలు, చెత్త తరలింపు, డంపింగ్‌ యార్డుల వద్దకు చేరిన చెత్త వివరాలను క్షణాల్లో వీటీఎస్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పైగా ప్రస్తుతం వాహనం ఎక్కడుందనే విషయాన్ని లైవ్‌ లోకేషన్‌ ద్వారానూ పసికట్టవచ్చు. ఇందుకు వెహికల్‌ షెడ్‌తోపాటు దొంతాలి, బోడిగాడితోట ప్రాంతాల వద్ద కూడా వీటీఎస్‌ను పర్యవేక్షిస్తున్నారు. 


సచివాలయానికి ఒక వాహనం 

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు 125 వాహనాలు కొత్తవి అందాయి. వీటితోపాటు ఇప్పటికే ఉన్న 54 వాహనాలతో ఇళ్ల నుంచే చెత్తను  సేకరించనున్నారు. ఈ క్రమంలో నగరంలోని 167 డివిజన్‌ సచివాలయాలకు ఒక్కోటి చొప్పున వాహనాన్ని అందచేసే విధంగా కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సచివాలయంలోని శానిటేషన్‌ సెక్రటరీ సారఽథ్యంలో స్థానికంగా రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకుని అదే మార్గంలో వాహనం ప్రయాణించే విధంగా వీటీఎస్‌ను అప్‌డేట్‌ చేయనున్నారు. 


ఏడాదికి రూ.70.56 లక్షలు ఆదా 

చెత్త వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణకు అమలు చేయనున్న వీటీఎస్‌ విధానంతో నగర పాలక సంస్థ ఖజానాకు ఏడాదికి రూ.70.56 లక్షలు ఆదా అవుతుందని అధికారుల అంచనా. వంద వాహనాలపై రోజుకు 200 లీటర్లు, నెలకు 6వేల లీటర్ల వరకు డీజిల్‌ మిగులుతుందంటున్నారు. ఆ లెక్కన ఏడాదికి 72 వేల లీటర్ల డీజిల్‌ మిగిలే అవకాశం ఉందని, దాని ద్వారా రూ. 70.56 లక్షలు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.



Updated Date - 2021-09-17T05:01:14+05:30 IST